మద్రాసు కంటే ఎన్నో సౌకర్యాలను తెలంగాణలో కల్పించాం
తెలంగాణలో సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది
రోడ్లు, భవనాల శాఖ, సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ‘సినీ ఇండస్ట్రీ ఎక్కడికి పోదని, మద్రాసు కంటే ఎన్నో సౌకర్యాలను తెలంగాణలో కల్పించామని రోడ్లు, భవనాల శాఖ, సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రపంచస్థాయి సినిమాలు, హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ చేసుకుంటున్నాయన్నారు. తెలంగాణలో సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందించి ముందుకు తీసుకెళ్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో సానుకూల దృక్పథంతో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనపై ప్రతినిత్యం ఆరా తీస్తున్నారని ఆయన అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్‌ను రోడ్లు, భవనాల శాఖ, సినిమా ఫొటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ‘పుష్పా 2’ నిర్మాత నవీన్‌లు సోమవారం పరామర్శించారు. అనంతరం పుష్పా 2 నిర్మాతతో కలిసి కోమటిరెడ్డి రూ.50 లక్షల చెక్కును మృతి చెందిన రేవతి భర్త భాస్కర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రతి విషయాన్ని రాజకీయం చేయొద్దని, ఇంతపెద్ద సంఘటన జరగడం తనకు చాలా బాధగా ఉందని మంత్రి తెలిపారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని దేవుడు దయవల్ల అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. రేవతి మృతితో తన కుటుంబంలో ఓ సభ్యురాలు పోయినంతగా బాధపడుతున్నానని ఆయన అన్నారు. ఆ కుటుంబ పరిస్థితి చూసి చాలా బాధగా అనిపిస్తుందని మంత్రి తెలిపారు. ఎవరిపైనా దాడులు చేస్తే చట్టం ఊరుకోదని కఠిన చర్యలు తప్పవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు.
అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనను ఖండిస్తున్నానని మంత్రి తెలిపారు. సినీ హీరోల, నిర్మాతల ఇళ్లపై దాడి చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. అలా చేస్తే చర్యలు తప్పవని, చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం మానుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలను పోలీసు శాఖ చూసుకుంటుందని ఆయన అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, కెటిఆర్‌లు ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు. రేవతి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చలేమని ఆయన తెలిపారు.