Wednesday, December 25, 2024

ప్రభుత్వం ‘కుంభకర్ణుని’లా నిద్రిస్తోంది:రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని, దైనందిన అవసరాలకు చిన్న చిన్న విషయాలకూ వారు రాజీ పడవలసి వస్తోందని, కానీ ప్రభుత్వం ఏమో ‘కుంభకర్ణుని’లా నిద్రిస్తోందని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. ఢిల్లీ గిరి నగర్‌లో ఒక కూరగాయల మార్కెట్‌ను తాను సందర్శించి, గృహిణులతో జరిపిన ముఖాముఖిపై ఒక వీడియోను రాహుల్ తన సామాజిక మాధ్యమ వేదికల్లో పంచుకున్నారు. ఆహార వస్తువుల ధరల పెరుగుదల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను వారు ఏకరవు పెట్టారని ఆయన తెలిపారు. ‘కొన్ని రోజుల క్రితం నేను ఒక స్థానిక కూరగాయల మార్కెట్‌కు వెళ్లాను, కస్టమర్లతో కలసి షాపింగ్ చేస్తూ, సామాన్య ప్రజల బడ్జెట్ ఏవిధంగా క్షీణిస్తోందో, ద్రవ్యోల్బణం ఎలా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతోందో తెలుసుకోవడానికి విక్రేతలతో మాట్లాడాను’ అని రాహుల్ ఆ వీడియోతో తన హిందీ పోస్ట్‌లో తెలిపారు.‘పెరుగుతున్న ధరలతో జనం సతమతం అవుతున్నారు, రోజువారీ అవసరాలకు చిన్న విషయాలకూ వారు రాజీ పడవలసి వస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

‘వెల్లుల్లి, బఠాణీలు, ఇతర కూరగాయల ధరలపై చర్చించాం, జనం వాస్తవ అనుభవాలు విన్నాం. కిలో రూ. 400 వద్ద వెల్లుల్లి, కిలో రూ. 120 వద్ద బఠాణీలు అమ్మకం కావడం ప్రతి ఒక్కరి బడ్జెట్‌ను దెబ్బ తీసింది’ అని ఆయన అన్నారు. ప్రజలు ఏమి తినాలని, దేనిని ఆదా చేయాలని ఆయన అడిగారు. ‘టీ తాగుతూ సాగించిన సంభాషణల్లో ఆదాయం స్తంభించడం, ద్రవ్యోల్బణం అదుపు లేకుండా పెరుగుతుండడం వల్ల గృహిణుల జీవన సమస్యలను మేము అవగాహన చేసుకున్నాం. పొదుపు చేయడం అసాధ్యంగా మారింది, ఆహార ఖర్చులు భరించేందుకు రిక్షా చార్జీకి రూ. 10 సమీకరించడం కూడా ఎలా కష్టంగా మారిందో గ్రహించాం’ అని రాహుల్ వివరించారు. ద్రవ్యోల్బణం ప్రభావం గురించి తమ అనుభవాలను తనతో పంచుకోవలసిందిగా తాను ప్రజలను కోరినట్లు ఆయన తెలిపారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తూర్పారపడుతోంది, పెరుగుతున్న నిరుద్యోగిత, ధరలపై పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News