హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలీలో హిమపాతం భారీగా ఉండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోహ్తంగ్ లోని సొలాంగ్, అటల్ టన్నెల్ మధ్య సోమవారం రాత్రి తర్వాత దాదాపు 1000 కి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీస్లు రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. గత కొన్నిరోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీకి పర్యాటకులు పోటెత్తారు. అయితే నిన్న సాయంత్రం నుంచి వాతారణం అనుకూలించలేదు.
మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీస్లు రంగం లోకి దిగి ఇప్పటివరకు 700 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు రాజధాని సిమ్లా లోనూ మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రం లోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో ఏటా డిసెంబర్ చివరివారంలో మనాలీకి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది.