Wednesday, December 25, 2024

42 శాతం రిజర్వేషన్లను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోము:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బిసిలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని, హామీల అమలు కోసం పోరాటం చేస్తామని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా బిసిలకు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనను ఎగవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు,విశ్వకర్మ కుల సంఘాల నాయకులు మంగళవారం నాడు ఎంఎల్‌సి కవితను తన నివాసంలో కలిశారు. తమకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ… బిసిల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులను కుదేలు చేస్తున్నదని విమర్శించారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వం కనీస మద్ధతు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యధికంగా బిసి విద్యార్థులు లబ్ది పొందే ఫీజు రీయింబర్స్‌మెంట్, పూలే స్కాలర్‌షిప్ పథకాల నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. బిసిలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఐక్యతను చాటి హామీల అమలుకు ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు అన్యాయం చేస్తే బిఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో బిసిల కోసం అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని, ఇప్పుడు వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటి వరకు బిసి సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారని చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో యునైటెడ్ ఫులే ఫ్రంట్ నాయకులు బొల్లా శివ శంకర్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకులు కొట్టాల యాదగిరి ముదిరాజ్, దాసరి నరేష్ ముదిరాజ్, నాగభూషణం ముదిరాజ్, భిక్షపతి ముదిరాజ్, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ చీఫ్, ఫౌండర్ విశ్వనాథుల పుష్పగిరి, జాతీయ సహాయ కార్యదర్శి చొల్లేటి ప్రభాకర్, అబ్బోజు రామ్ సుధాకరాచారి, హేమ జిల్లోజు, స్థపతి, యూత్ వింగ్ కార్యదర్శి నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News