Thursday, December 26, 2024

ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఇటిక్యాల : గద్వాల జిల్లా, ఎర్రవల్లి మండల కేం ద్రంలో బీచుపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తమకు వద్దని విద్యార్థులు దాదాపు 18 కిలోమీటర్లు రహదారిపై నడుచుకుంటూ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.ప్రిన్సిపాల్‌ను తక్షణం సస్పెండ్ చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులంలో తాము పడుతున్న ఇబ్బందులు వివరిస్తూ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ నాయక్ పది, ఇంటర్మీడియట్ సిలబస్‌ను పూర్తి చేయడం లేద ని, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు తమకు అర్థం కావడంలేదని ఎం ఎల్‌ఎ ఎదుట వాపోయారు.

ఇదే విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకుని వెళ్ళినా పట్టించుకోకపోగా తమపై అనుచితంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ భోజనం మెనూ ప్రకారం అందించడం లేదని ఎన్నిసార్లు ప్రిన్సిపాల్‌కు మొరపెట్టుకున్నా ప్రశ్నించే విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రులు తమతో మాట్లాడేందుకు వస్తే వారి పట్ల కూడా ప్రిన్సిపాల్ దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న ఎంఎల్‌ఎ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News