Thursday, December 26, 2024

భూ కబ్జాదారుల బరితెగింపు

- Advertisement -
- Advertisement -

మండల రెవెన్యూ అధికారిపై కబ్జాదారుల దాడి
నిందితులపై జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు
మన తెలంగాణ/జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లో భూ కబ్జాదారు లు బరితెగించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలకు పాల్పడిన కబ్జాదారులు కూల్చివేతలకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెవెన్యూ అధికారి చొ క్కా చినిగిపోయి ఛాతిపై గాయాలయ్యాయి. మంగళవారం కాప్రా మండలం జవహర్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కొంతమంది కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.ఈ అక్రమ నిర్మాణాలపై సమాచా రం అందుకున్న తహసీల్దార్ సుచరిత ఆదేశాల మేరకు మండల గిర్దావర్‌లు రమేష్, వీరేంద్రసాయిలు మున్సిపల్, డిజాస్టర్ టీమ్, పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.

చెన్నాపురంలోని దేవేందర్‌నగర్ ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 645, 646లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపడుతుండగా కబ్జాదారులు గిర్దావర్ రమేష్‌పై దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా గుంపుగా చేరి గిర్దావర్‌పై దాడికి పాల్పడి చొక్కా చింపి ఛాతిపై గాయాలు చేశారు. ఈ సంఘటనతో అటు పోలీసులు,రెవెన్యూ అధికారులు భూకబ్జాదారుల నుంచి రెవెన్యూ అధికారిని తప్పించి తహసీల్దార్‌కు సమాచారం అందించారు. ఈ సంఘటనలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని రెవెన్యూ అధికారులు వాపోయారు.పోలీసులు బందోబస్తు ఇవ్వాల్సి ఉండగా ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ దాడిలో గాయపడిన గిర్దావర్ రమేష్‌ను ఆసుపత్రికి తరలించారు.కాప్రా మండల తహసీల్దార్ సుచరిత ఆదేశాల మేరకు జవహర్‌నగర్ పోలీసులకు దాడికి పాల్పడిన నిందితులపై గిర్దవార్ రమేష్ ఫిర్యాదు చేశాడు.

దాడికి తీవ్రంగా ఖండించిన తహసీల్దార్
విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారిపై భూకబ్జాదారులు దాడికి పాల్పడటంపై తహసీల్దార్ మండిపడ్డారు.ప్రభుత్వ భూముల పరిరక్షణకు కృషి చేస్తున్న గిర్దావర్‌పై దాడులకు పాల్పడిన వ్యక్తులపై జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు.

గిర్దావర్‌పై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు
అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య తెలిపారు.మంగళవారం జవహర్‌నగర్‌లోని దేవేందర్‌నగర్ సర్వే నెంబర్ 645,427,428 లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా రాపనోళ్ల రాజు,వడ్డెర శ్రీనుతో పాటు మరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దాడులకు పాల్పడ్డారు.మరో ఘటనలో డెంటల్ కాలేజీ సమీపంలోని సర్వే నెంబర్ 655లో నిర్మించిన అక్రమ నిర్మాణం కూల్చివేతలో వడ్డెర వెంకటేష్‌తో అతని అనుచరులు కూల్చివేతలను అడ్డుకున్నారు.అంతేగాకుండా రెవెన్యూ సిబ్బందిని బెదిరించారు.ఈ మేరకు తహసీల్దార్ సుచరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News