ఇప్పటివరకూ జనబాహుళ్యంలో
ఉన్నది తెర ముందు చరిత్రే..
స్వరాష్ట్ర సాధనలో తెర వెనుక
ఎందరో మహానుభావులు వారిలో
అగ్రగణ్యుడు జైపాల్‌రెడ్డి నట్స్,
బోల్ట్ ఆఫ్ వార్ అండ్ పీస్
పుస్తకావిష్కరణలో సిఎం రేవంత్‌రెడ్డి
అదానీతో ఒప్పందాలను ఏకపక్షంగా
రద్దు చేయలేమని వివరణ
రాష్ట్ర ఆవిర్భావానికి జరిగిన పోరాటంలో తెరవెనుక అనేక మహోజ్వల ఘట్టాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తెలిసిందంతా తెర ముందు జరిగిందే. కానీ తెర వెనక జైపాల్రెడ్డిలాంటి మహోన్నతుల అవిరళ కృషి ఎన్నదగినది. ఈ చరిత్రను అక్షరబద్ధం చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత రచయితలపై ఉన్నది.
ఇప్పటివరకూ జనబాహుళ్యంలో
ఉన్నది తెర ముందు చరిత్ర
స్వరాష్ట్ర సాధనలో తెర వెనుక
ఎందరో మహానుభావులు వారిలో
అగ్రగణ్యుడు జైపాల్‌రెడ్డి నట్స్,
బోల్ట్ ఆఫ్ వార్ అండ్ పీస్
పుస్తకావిష్కరణలో సిఎం రేవంత్‌రెడ్డి
అదానీతో ఒప్పందాలను ఏకపక్షంగా
రద్దు చేయలేమని వివరణ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావానికి తెరవెనుక జరిగిన చరిత్రను భావితరాలకు అందించే కృషి జరగాలని సిఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికీ వరకు జనబాహుళ్యంలో ఉన్న చరిత్ర తెరముందు జరిగిందేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తెరముందు కనిపించే వారే కాకుండా తెరవెనుక అమితంగా కృషి చేసిన వారిలో చాలామంది ఉన్నారని సిఎం పేర్కొన్నారు. అలాంటి అగ్రగణ్యుల్లో దివంగత జైపాల్‌రెడ్డి ఒకరని ఆయన అన్నారు. రవీంద్రభారతిలో మంగళవారం ‘నట్స్ బోల్ట్ ఆఫ్ వార్ అండ్ పీస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుస్తక రచయిత యాదవరెడ్డి కూడా తెలంగాణ ఉద్యమంలో 1969 నుంచి తన కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు.
రాష్ట్రం ఏర్పాటుకు ముందు సోనియాగాంధీతో ప్రత్యేకంగా రెండుగంటల పాటు రాష్ట్రం ఏర్పాటు ఆవశ్యకతను యాదవరెడ్డి వివరించి ఒప్పించారన్నారు. అన్ని తెలిసిన యాదవరెడ్డి తెరవెనుక చరిత్రను భావితరాలకు అందించేందుకు ఒక పుస్తకాన్ని రాయాలని సిఎం ఆకాంక్షించారు. ముల్కీ- నాన్ ముల్కీ నుంచి, తొలిదశ, మలిదశ తెలంగాణ ఉద్యమాలు, రాష్ట్ర ఏర్పాటు వరకు సంపూర్ణ వివరాలతో ఒక పుస్తకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారి గురించి కూడా ఆ పుస్తకంలో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని సిఎం విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ కోణంలో కూడా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా వారి కోణంలో (ఆంధ్ర) కోణంలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పుస్తకం రాసారని సీఎం గుర్తు చేస్తూ, అప్పడు తెరవెనుక ఏమి జరిగిందో మన కోణం లో (తెలంగాణ) పుస్తకం రావాల్సిన అవసరం ఉందని సీఎం వివరించారు.
జైపాల్, యాదవరెడ్డి సాఫ్ట్‌కోర్ కమ్యూనిస్టులు
చాలా మంది సిద్ధాంతాలు చెబుతారు, కానీ పాటించే వారు మాత్రం కొద్దిమందే ఉంటారని సిఎం తెలిపారు. అలాంటి వారిలో యాదవరెడ్డి ఒకరని, నమ్మిన సిద్ధాంతాన్ని పాటించే వ్యక్తి ఆయన అని సిఎం పేర్కొన్నారు. సురవరం లాంటి వారు హార్డ్ కోర్ కమ్యూనిస్టులు అయితే జైపాల్ రెడ్డి, యాదవ రెడ్డి లాంటి వారు సాఫ్ట్‌కోర్ కమ్యూనిస్టులని ఆయన అన్నారు. దేశంలో పేదలకు అభివృద్ధి ఫలాలను అందించేందుకు వారు కాంగ్రెస్‌లో పని చేశారని, పదవుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారు పని చేశారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలోనూ యాదవరెడ్డి గారి కృషి ఎంతో ఉందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలి
2014 తరువాత దాదాపు 2వేల నుంచి 4వేల చదరపు కి.మీ వరకు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని, దీనిపై చర్చ చేసేందుకు పాలకులకు ధైర్యం లేదని, చర్చించే వారు అసలే లేరని సిఎం అన్నారు. మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు కారణం అక్కడ అధునాతన ఆయుధాలని సిఎం తెలిపారు. ఖనిజ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ సంస్థలు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. మన దేశంలో రెండు గిరిజన జాతులు ఎదురుపడితే అధునాతన ఆయుధాలతో ఊచకోత కోసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. భారత బలగాలు మణిపూర్‌లో శాంతిని నెలకొల్పాలేవా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు. తలచుకుంటే అక్కడి ఆయుధాలను సీజ్ చేయలేరా? అని సిఎం అన్నారు. దేశంలో నెలకొన్న భయానక వాతావరణంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై కూడా చర్చ జరగాలన్నారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలని, వాటిని నియంత్రించాలని, అప్పుడే దేశంలో శాంతి నెలకొల్పబడుతుందని సిఎం అన్నారు.