పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విపక్షాలు, అధికార పక్షం మధ్య పెద్ద రాద్ధాంతంగా మారాయి. ఇది రానురాను దేశవ్యాప్తంగా ఆందోళన జ్వాలలను రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఆగ్రహ జ్వాలలను ఆర్పడానికి వీలైనంత త్వరలో అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ తెరమీదకు వస్తోంది. కానీ అది జరుగుతుందా? అన్నది ప్రశ్నార్థకమే. అసలు దీనివెనుక మర్మం ఏమిటంటే రాజ్యాంగంలోని ఉన్నత విలువల సూత్రాల ప్రభావం, వాటి రక్షణ కోసం పోరాటం చేయడం కన్నా అంబేద్కర్‌ను కేంద్రంగా చేసుకుని దళితుల ఓటర్లను ఆకర్షించడానికే రాజకీయ పార్టీల ఆరాటమని కొన్ని విమర్శలు వస్తున్నాయి. హోం మంత్రి నోరుజారడాన్ని ఒక అవకాశంగా ప్రధాన విపక్షం తీసుకుంది. మొత్తం 98.6 కోట్ల మంది ఓటర్లలో 17 శాతం మంది వరకు ఉన్న అంబేద్కర్ అనుయాయులకు రాజ్యాంగం పరంగా హక్కులు కల్పించిన అంబేద్కర్ వారందరికీ నిజంగా దేవుడే. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. వాస్తవం చెప్పాలంటే భారతీయ సమాజంపై డాక్టర్ అంబేద్కర్ తాలూకు రాజకీయ, సామాజిక ప్రభావం సామాజిక న్యాయపోరాటంగా వ్యాపించి, భారతీయ కులవ్యవస్థలో అవమానాలకు, అసమానతలకు బలవుతున్న అణగారిన, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించింది. రాజ్యాంగపరమైన హక్కుల బలాన్ని వారికి అందించింది. పాశ్చాత్య దేశాల్లో బానిసత్వం రీతిలో భారత దేశంలోని కులవ్యవస్థ పాతుకుపోయి అణగారిన వర్గాలను చాలా దీనహీన స్థితికి గురిచేసింది. అంతవరకు బ్రిటిష్ వలసవాద విధానమే తప్ప మనకంటూ స్వతంత్ర రాజ్యాంగం లేని పరిస్థితుల్లో రాజ్యాంగ రచన నిర్మాణానికి అహోరాత్రులు అంబేద్కర్ జీవితాన్ని అంకితం చేశారు. రాజ్యాంగ రూపశిల్పిగా చరిత్ర సృష్టించారు. అయినా గాంధీ, నెహ్రూ సిద్ధాంతాలు నచ్చక విభేదించేవారు. ప్రాచీన కులవ్యవస్థకు వ్యతిరేకంగా తాను సాగించిన పోరాటానికి గాంధీ, నెహ్రూ కాలంలోనే అంబేద్కర్ తగిన గౌరవాన్ని పొందలేకపోయారు. నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ కానీ, ఆర్‌ఎస్‌ఎస్ మూలాలున్న అప్పటి వేరే పార్టీ కానీ అత్యున్నత సూత్రాలు, ఆదర్శాల కోసం అంబేద్కర్ సాగించే పోరాటానికి పూర్తి మద్దతు ఇవ్వలేదు. అందువల్ల ఆయన కాంగ్రెస్ పాలనలో న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. కానీ ఇప్పుడు ఒకపక్క కాంగ్రెస్, మరోవంక ఆర్‌ఎస్‌ఎస్ భావజాల బిజెపి తామే అంబేద్కర్ వారసత్వాన్ని పరిరక్షిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి. అంబేద్కర్‌కు నిజమైన వారసులమని పదేపదే చెప్పుకొంటున్నాయి. దేశంలోని మొత్తం ఓటర్లలో దళితులు, వెనుకబడిన వర్గాలు ఐదోవంతు వరకు ఉన్నప్పటికీ, ఎన్నికల సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఓట్లు వేస్తుండటం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అంబేద్కర్ అంశాన్ని విపక్షాలు కీలకంగా తీసుకున్నాయి. అమిత్ షా పదవికి రాజీనామా చేసేవరకు పోరాటం విడిచిపెట్టబోమని గట్టిగా చెబుతున్నాయి. ఏకపక్షంగా అధికారపార్టీ గుత్తాధిపత్యం వహిస్తున్న పార్లమెంట్‌లో ఈమేరకు చర్చకు ప్రాధాన్యం కల్పించడం లేదు. పైగా ప్రధాని మోడీ అమిత్ షాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అమిత్ షా తప్పేమీ మాట్లాడలేదని వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ బయట ఆందోళనలు సాగించడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. వామపక్ష పార్టీలు కూడా ఏకతాటిపై నిలిచి దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమంలా ఆందోళన సాగించడానికి నిర్ణయించుకున్నాయి. ఇదంతా చూస్తుంటే అంబేద్కర్ సేవలకు రానురానూ వాడవాడలా అణగారిన వర్గాల నుంచి మన్నన ఎంతో లభిస్తోంది. అంబేద్కర్‌ను అమిత్ షా వ్యాఖ్యలు అవమానపరిచాయన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయితే దళితుల మేలు కోసం జీవితాంతం పోరాడిన అంబేద్కర్ సూత్రాలకు, ఆదర్శాలకు సంపూర్ణ గౌరవాన్ని ప్రకటించని ప్రధాన జాతీయ పార్టీలు రెండూ ఇప్పుడు రాజకీయంగా అంబేద్కర్ గురించి, దళితుల గురించి ముఖాముఖిగా పోరాటానికి సిద్ధపడటం హాస్యాస్పదం. రాజ్యాంగంపై చర్చలో ఈ రెండు పార్టీలు డాక్టర్ అంబేద్కర్ చరిత్రలోకి వెళ్తే వీటి పాత్ర పేలవంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు దళితుల నుంచి భారీగా ఓట్లు పడ్డాయి. ఈ మేరకు దళితులను తాము మొదటి నుంచీ కలుపుకొని వస్తున్న రికార్డును మరీ ప్రదర్శించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇక బిజెపి విషయానికి వస్తే హిందుత్వ సిద్ధాంతానికి మద్దతు ఇవ్వడమే కాక, 52 శాతం వరకు ఉన్న ఒబిసిల దిశగా కులవ్యవస్థను తమ ధోరణిలో ప్రోత్సహిస్తున్నప్పటికీ, మోడీ హయాంలో పేదలకు అనుకూలమైన విధానానాలే అమలవుతున్నాయని బిజెపి ప్రచారం చేస్తోంది. ఈ విధంగా రెండు ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు ఎత్తుగడలతో వాదనలు సాగించడం వల్ల ఒరిగిందేమీ ఉండదు. దేశ జనాభాలో నాలుగోవంతు ఉన్న దళితులు, ఆదివాసీల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? వారికి రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులు సరిగ్గా అమలవుతున్నాయా లేదా? లేక మరేమైనా చేయాలా? అన్నది చర్చించాలి. అలాగే దళితులు, ఆదివాసీలే కాకుండా మొత్తం 142 కోట్ల మంది జనాభా జీవన ప్రమాణాల మెరుగుకు రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం ఏం చేస్తే బాగుంటుందన్న చర్చ సమగ్రంగా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జరగాలి. అప్పుడే 75 ఏళ్ల రాజ్యాంగంపై సమగ్రంగా సమీక్షించారన్న సంతృప్తి అన్ని వర్గాలకు కలుగుతుంది. ఆ ప్రకారం కార్యాచరణ ప్రణాళికలకు సమాయత్తం కావడం పాలక వర్గాల తక్షణ కర్తవ్యం.
దళిత ఓట్లకా అంబేద్కర్‌పై రణం!
- Advertisement -
- Advertisement -
- Advertisement -