Thursday, December 26, 2024

జనవరి 9 న వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకెన్ల జారీ

- Advertisement -
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయంంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుండి 1.20 లక్షల టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు స్కూల్, ఎం.ఆర్. పల్లి స్కూల్ తో పాటు (తిరుమలలో బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ లో తిరుమల స్థానికుల కొరకు )కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్ లను జారీ చేస్తామని తెలిపారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికి తిరుమవలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టిటిడి జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీధర్‌తో కలిసి ఈవో తనిఖీ చేశారు. ఈవో వెంట సీఈ సత్యనారాయణ, ఎస్.ఈ వెంకటేశ్వర్లు, మనోహర్, ట్రాన్స్ ఫోర్ట్ జీఎం శేషారెడ్డి, తదితర టిటిడి అధికారులు, పోలీసు, రెవిన్యూ అధికారులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News