Thursday, December 26, 2024

త్వరలోనే ఢిల్లీ సిఎంను అరెస్ట్ చేస్తారు : కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అతిశీని త్వరలోనే అరెస్టు చేస్తారని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. “ ఆప్ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ యోజన , సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చలేదు. దీంతో ఓ తప్పుడు కేసులో త్వరలో ముఖ్యమంత్రి అతిశీని అరెస్టు చేస్తారు. అంతకంటే ముందు ఆప్ సీనియర్ నాయకుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారు’ అని రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఎన్నికల నేపథ్యంలో … తాము మళ్లీ అధికారం లోకి వస్తే ‘ మహిళా సమ్మాన్ యోజన’ కింద మహిళలకు ప్రతినెలా రూ.2100 ఆర్థిక సాయం చేస్తామని ఆప్ ప్రకటించింది. దీంతోపాటు ‘ సంజీవని యోజన’ కింద ఢిల్లీలోని సీనియర్ సిటిజన్లు అందరికీ , అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది.

ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించింది. మరోవైపు ఈ పథకాలకు సంబంధించి ఢిల్లీ వాసులను హెచ్చరిస్తూ వార్తాపత్రికలో ఓ ప్రకటన వెలువడింది. అందులో ‘ మహిళా సమ్మాన్‌యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని ఓ రాజకీయ పార్టీ చెబుతోందని మీడియా కథనాల ద్వారా మా దృష్టికి వచ్చింది. ఈ పథకానికి సంబంధించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ప్రభుత్వం అలాంటి స్కీమ్‌ను నోటిఫై చేయలేదు. అంతేకాక ఢిల్లీలో ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సంజీవని పథకం లేదు. ఈ పథకానికి సంబంధించి వృద్ధుల వ్యక్తిగత సమాచారం లేదా డేటాను సేకరించే అధికారం ఎవరికీ ఇవ్వలేదు’ అని మహిళా, శిశు అభివృద్ధి , ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖలు పేర్కొన్నాయి. ఈ ప్రకటన నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ … ఇటీవల సిబిఐ, ఈడీ అధికారుల సమావేశం జరిగిందని, ఆ సందర్భంగా సీఎంను తప్పుడు కేసులో అరెస్టు చేయాలనుకుంటున్నట్టు మాట్లాడుకున్నారని ,

ఆ సమాచారం తమ వద్ద ఉంది ’ అని పేర్కొన్నారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అతిశీ మాట్లాడుతూ .. వార్తా పత్రికలో వచ్చిన ప్రకటనను తప్పుబట్టారు. ‘ కొంతమంది అధికారులపై ఒత్తిడి తెచ్చి బీజేపీ ఈ నోటీసులు ప్రచురించింది. ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటాం. ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసు నిలిపివేసేందుకు , నాపై తప్పుడు కేసు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మా వద్ద సమాచారం ఉంది. వారు నన్ను అరెస్టు చేసినా, నాకు న్యాయవ్యవస్థ, రాజ్యాంగంపై నమ్మకం ఉంది. నాకు బెయిలు వస్తుంది” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News