Friday, December 27, 2024

జిసిసి హబ్‌గా హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో జిసిసిలు
ఏర్పాటు చేసేందుకు దిగ్గజ
కంపెనీలు చూపు 2024
చివరి నాటికి 355కు
చేరనున్న జిసిసిల సంఖ్య
జిసిసి తెలంగాణ ప్లే బుక్‌ను
విడుదల చేసిన నాస్కామ్
ఐటీ ఎగుమతులు…ఆర్థికాభివృద్ధిలో
జిసిసి కీలకం : ఐటి మంత్రి
దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
మన తెలంగాణ / హైదరాబాద్ : గ్లోబల్ కేపబిలిటీ సెంటర్…ఇప్పుడీ పదం మన దే శ ఐటీ రంగంలో హాట్ టాపిక్. సంక్షిప్తం గా జిసిసిలుగా పిలుచుకునే వీటిని ఆకర్షించడానికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరా త్, ఢిల్లీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇ తోధికంగా రాయితీలు ప్రకటిస్తున్నాయి. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ మన హైదరాబాద్ నగరం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జిసిసి)కు హబ్‌గా మారుతోంది. గడిచిన ఐదేళ్లలో భారత్‌లో 1,700 జిసిసిలు, 2,975 జిసిసి యూనిట్లు ఏర్పాటు కాగా వీటిలో 30 శాతం హైదరాబాద్‌లోనే నెలకొల్పటం గమనార్హం. 2019లో హైదరాబాద్‌లో 230 జిసిసిలు ఉండగా 2024 నాటికి వీటి సంఖ్య 355కు చేరింది. భారత సాంకేతిక వాతావరణం, ఉద్యోగాల క ల్పన, మార్కెట్ వృద్ధి, సామర్థ్యాల పెంపుద ల తదితరాల్లో 2030 నాటికి జిసిసిలు కీలకపాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నా రు. అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపా ల నిర్వహణ కోసం స్థానిక నైపుణ్యాలు, ప్రావీణ్యత, వనరులను ఒడిసి పట్టుకునేందుకు దిగ్గజ కంపెనీలు వ్యూహాత్మకంగా జిసిసి ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యం లో ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ’(నాస్కామ్) తెలంగాణలో జిసిసిల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరిస్తూ ఇటీవల ‘జిసిసి తెలంగాణ ప్లే బుక్’ను విడుదల చేసింది. దేశీయ జిసిసిపరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.84.38 లక్షల కోట్లు)కు చేరనుంది. అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ సంఖ్య 25 లక్షలకు పెరగనుంది.

భారత్‌లో జిసిసిలపై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 1,700 పైచిలుకు జిసిసిలు ఉన్నాయి. వీటి మొత్తం వార్షిక ఆదాయం 64.6 బిలియన్ డాలర్ల పైగా ఉండగా 19 లక్షల మంది ప్రొఫెషనల్స్ వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. భారతీయ జిసిసిలు సంఖ్యాపరంగానే కాకుండా సంక్లిష్టత, వ్యూహాత్మక ప్రాధాన్యతపరంగా కూడా ఎదుగుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో సగానికి పైగా సెంటర్స్, సాంప్రదాయ సర్వీసుల పరిధికి మించి సేవలు అందిస్తున్నాయని నివేదిక పేర్కొంది. గ్లోబల్ కార్పొరేషన్ల వ్యూహాత్మక కార్యకలాపాలకు కీలక కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోనే జిసిసి మార్కెట్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరనుంది. అలాగే సిబ్బంది సంఖ్య 25 లక్షలకు చేరనుందని పేర్కొంది. నివేదిక ప్రకారం 70 శాతం సెంటర్లు 2026 నాటికి అధునాతన కృత్రిమ మేథ సామర్థ్యాలను సంతరించుకోనున్నాయి. వీటిలో ఆపరేషనల్ అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ మొదలుకుని ఏఐ ఆధారిత కస్టమర్ సపోర్ట్, ఆర్‌అండ్‌డీ కార్యకలాపాల వరకు వివిధ సామర్థ్యాలు ఉండనున్నాయి.

తూర్పు యూరప్‌తో పోలిస్తే నిర్వహణ వ్యయాలు సగటున 40 శాతం తక్కువగా ఉండటం వల్ల నాణ్యత విషయంలో రాజీపడకుండా కార్యకలాపాలను పటిష్టం చేసుకోవడానికి అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న 100 పైగా జిసిసి దిగ్గజాలపై సర్వే, పరిశ్రమ నిపుణులతో ఇంటర్వ్యూలు, అధ్యయనాలు మొదలైన అంశాల ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది. హైదరాబాద్‌లో నాణ్యమైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ వాతావరణం వేగంగా వృద్ధి చెందుతుండమే ఇందుకు కారణమని చెప్పారు. ప్రభుత్వం భూమి కొనుగోలుపై రాయితీ, ఐటీ పార్క్ ప్రోత్సాహకాలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, విద్యుత్ రాయితీ, పేటెంట్‌కు మద్దతు ఇస్తోంది. టాస్క్, స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా వేలాది మందికి నైపుణ్య శిక్షణ, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఎస్‌బీ వంటి అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఉండడంతో ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మల్టీనేషనల్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

వివిధ రంగాల్లో జిసిసిల ఏర్పాటుకు అనువుగా వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 40 లక్షల నుంచి 60 లక్షల చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ సంస్థలైన టీ హబ్, వీ హబ్, టీఎస్‌ఐసీ వంటి స్టార్టప్ ఇంక్యుబేటర్లతో 50కి పైగా జిసిసిలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణలో ఏటా స్టెమ్ కోర్సుల్లో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్) లక్షకు పైగా విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. వీరిలో 80 వేల నుంచి 90 వేల మంది ఇంజనీరింగ్, సాంకేతిక రంగాలకు చెందినవారే. డేటా సెంటర్ల ఏర్పాటుకు అనువుగా భూకంప సంభావ్యత తక్కువగా ఉండటం, ఏఐ సాంకేతికతకు సంబంధించిన మౌలిక వసతులు ఎక్కువగా ఉండడంతో ఆసక్తి చూపుతున్నారు. నిపుణులైన మానవ వనరుల లభ్యత, దేశ జనాభాలో 20-34 ఏళ్లలోపు యువత 24శాతం ఉండడం, పైగా ఆంగ్ల భాషలో ప్రావీణ్యం కలిగి ఉండటం, మొత్తం పట్టభద్రుల్లో 24శాతం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్) పట్టభద్రులే ఉండటంతో తమ జిసిసి ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు భారత్ దేశాన్నే ఎంచుకుంటున్నాయి.

వీటిలో 57శాతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించినవి. మరో 29శాతం టెక్నాలజీ, మీడియా, టెలికం రంగాలకు చెందినవి. ఇవి ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, దిల్లీల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ ఆకర్షణలో నాలుగేళ్లుగా హైదరాబాద్ నగరం దూకుడు ప్రదర్శిస్తోంది. దీంట్లో ఏకంగా బెంగళూరును దాటేసింది. భారత్‌లో ఉన్న జిసిసిల్లో 20 శాతానికిపైగా హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్న మానవ వనరులు అందుబాటులో ఉండటం, తక్కువ జీవన వ్యయం, అనుకూల ప్రభుత్వ విధానాల కారణంగా ఆయా సంస్థలు బెంగళూరు తర్వాత హైదరాబాద్‌వైపు మొగ్గు చూపుతున్నాయి. 2023 అక్టోబరు నుంచి 2024 జనవరి వరకు మన దేశంలోకి కొత్తగా 14 జిసిసిలు రాగా వాటిలో ఎవర్‌నోర్త్, ఎల్లాయిడ్ బ్యాంకింగ్ గ్రూపు, వార్నర్ బ్రదర్స్ సంస్థలవి తెలంగాణలో కొలువుతీరాయి. 29 జిసిసిలు విస్తరణ దిశగా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న గోల్డ్‌న్ శాక్స్, ఫెడెక్స్, టీజేఎక్స్, స్టెల్లాంటిస్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బ్రిస్టల్ మైయర్ స్క్విబ్, ఇన్‌స్పైర్ బ్రాండ్స్ జిసిసిలు విస్తరణలో ఉన్నాయి.

ఇటీవల వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ సైతం తమ జిసిసిని నగరంలోని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏఐ/ఎంఎల్, డేటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్‌లలో స్కిల్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. హైదరాబాద్ జిసిసిల్లో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్సల్టింగ్ రంగాల శాతం ఎక్కువ ఉంది.తెలంగాణలో ఏర్పాటవుతున్న జీసీసీలు కొన్ని ప్రధాన రంగాల్లో కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్/ఇంటర్‌నెట్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్, ఎఫ్‌ఎంసీజీ, సెమీకండక్టర్, ఫార్మాస్యూటికల్స్, రిటైల్, మెడికల్ డివైజెస్, టెలి కమ్యూనికేషన్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, ఆటోమోటివ్, వృత్తిపరమైన సేవల రంగాల్లో జిసిసిల ఏర్పాటుకు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. తెలంగాణలో ఏర్పాటైన జిసిసిలన్నీ హైదరాబాద్‌లో ప్రత్యేకించి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, మణికొండలోనే కేంద్రీకృతమయ్యాయి. అయితే ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లోనూ జిసిసిల ఏర్పాటుకు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నట్లు నాస్కామ్ ప్రకటించింది.

ఐటీ ఎగుమతులు…ఆర్థికాభివృద్ధిలో జిసిసి కీలకం : ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
రాష్ట్ర ఐటీ ఎగుమతులు, ఆర్థికాభివృద్ధిలో మిడ్ మార్కెట్ జిసిసి కీలకమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఏఐ, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో హైదరాబాద్‌కు ఉన్న అసాధారణ ప్రతిభతోపాటు, సహాయక విధానాలు, బలమైన మౌలిక సదుపాయాలతో మేము ఈ కీలక ప్లేయర్స్‌ను ఆకర్షించడానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. భారత్‌లో 2010లో 700 జిసిసిలు ఉండగా వాటిలో 4 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పనిచేశారని చెప్పారు. 2023 సంవత్సరం నాటికి మొత్తం 1600 జిసిసిలు ఏర్పాటుకాగా ఉద్యోగుల సంఖ్య 16.59 లక్షలకు చేరిందన్నారు. ఇక 2028 సంవత్సరానికి వీటి సంఖ్య 2,100కి పెరగనుందని, అప్పటికవి 34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News