Friday, December 27, 2024

దా‘రుణ’ యాప్‌లకు కేంద్రం చెక్

- Advertisement -
- Advertisement -

రుణాలు ఇచ్చే యాప్‌ల దారుణాలకు దేశంలో ఎందరో బలవుతున్నారు. ప్లేస్టోర్, యాప్ స్టోర్‌ల జాబితాలో చేరిన రుణయాప్‌ల్లో చట్టబద్ధమైన రుణయాప్‌లతో పాటు మోసాల యాప్‌లు కూడా చేరడంతో వీటి సంగతి తెలియక ఎందరో వీటిని నమ్మి రుణాలు పొందుతున్నారు. ఈ విధంగా రుణయాప్‌లను వినియోగించుకుంటున్నవారు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోకెల్లా భారత్‌లోనే అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది.ఈ యాప్‌ల నుంచి అప్పు తీసుకునే వ్యక్తి తాము పెట్టే గడువు లోగా అసలు, వడ్డీలు సహా చెల్లించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయించడం వంటి సమంజసమైన పద్ధతులను ఈ మోసాల యాప్‌లు పాటించవు. వాటి యజమానులెవరో, ఎక్కడ ఉంటారో కూడా తెలీదు.ఈ రుణయాప్ సంస్థలు స్థానికంగా ఉన్న తమ ఏజెంట్ల ద్వారా బ్లాక్‌మెయిల్ చేయించి రుణాలు వసూలు చేసుకునే కర్కశమైన విధానాన్ని పాటిస్తున్నాయి. రుణగ్రహీతల సెల్‌ఫోన్లలోని నంబర్లు ఉన్న వారందరికీ రుణగ్రహీత అప్పు ఎగ్గొట్టాడని ప్రచారం చేస్తుండటం, దీంతో రుణగ్రహీత తన పరువు పోయిందన్న వేదనతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుండటం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ దారుణాలు విపరీతంగా సాగుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో 20 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి ఆన్‌లైన్ యాప్ నుంచి రుణం తీసుకుని చెల్లించలేక చివరకు హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చేసిన రుణానికి సంబంధించి తల్లిదండ్రులు రూ. 3 లక్షలు చెల్లించినప్పటికీ యాప్ ఏజెంట్లు అతని పరువు తీసే విధంగా వేధించి, హింసించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని కిస్మత్‌పూర్‌కు చెందిన 29 ఏళ్ల సునీల్, మెదక్ జిల్లా నర్సాపూర్ వాసి శ్రవణ్ యాదవ్, సిద్దిపేటకు చెందిన మౌనిక రుణయాప్‌ల విషవలయంలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 28 ఏళ్ల యువకుడు యాప్ లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకే బలైపోయాడు. 2020లో లెండింగ్ యాప్ ఉద్యోగుల వేధింపులు వల్లనే తెలంగాణలో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత మేలో విజయవాడకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఎం. వంశీకృష్ణ (22) రుణయాప్ ఏజెంట్ల వేధింపులు భరించలేక కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలాంటి ప్రాణాంతక దారుణాలపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రం సిద్ధమైంది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న రుణయాప్‌లపై ఎప్పటికప్పుడు నిఘా నిర్వహించడానికి, ఈ అనియంత్రిత రుణాలకు (అన్‌రెగ్యులేటెడ్ లోన్లు) చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లులోని నిబంధనలను అతిక్రమిస్తే భారీ పెనాల్టీతోపాటు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ప్రజా ప్రయోజనాలను రక్షించేందుకు, ఇష్టారీతి రుణ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవలంబించాల్సిన విధివిధానాలపై 2021 నవంబర్ నెలలోనే ఆర్‌బిఐ.. ‘వర్కింగ్ గ్రూప్ ఆన్ డిజిటల్ లెండింగ్’ సమర్పించింది. దీని ప్రకారం తాజా ముసాయిదా బిల్లులోని ప్రతిపాదనలు పొందుపరిచారు. ఈ ప్రతిపాదనల ప్రకారం.. రిజర్వుబ్యాంకు లేదా ఇతర నియంత్రణ సంస్థల అనుమతి లేకుండా లోన్లు ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థలపై నిషేధం విధించాలి. రుణాన్ని డిజిటల్ లేదా ఏ రూపంలో అందిస్తున్నా చట్టాల పరిధి లోకి రాని పక్షంలో ఈ చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కనీసం రెండేళ్లు, ఆపై ఏడేళ్ల వరకు, పెనాల్టీ రూ. 2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. కోటి వరకు ఉంటుంది. చట్టవ్యతిరేక పద్ధతుల్లో రుణగ్రహీతలను వేధించేవారికి లేదా రికవరీ చేసేవారికి కనీసం మూడేళ్ల నుంచి పదేళ్ల పాటు జైలుశిక్ష సహా జరిమానా ఉంటుంది. ఇంకా ఎవరైనా రుణస్వీకర్త ఆస్తులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టయితే లేదా ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే స్థాయిలో ఎక్కువ మొత్తం ఉన్నా కూడా అప్పుడు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయొచ్చు. తగిన వివరాలు లేని చాలా రుణయాప్స్ ద్వారా, పెద్ద సంఖ్యలో జనం మోసపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు మధ్య కాలంలో దాదాపు 2200 కంటే ఎక్కువగా ఉన్న మోసపూరిత లోన్ యాప్స్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి కూడా తొలగించింది. దీనికి ముందు ప్రభుత్వం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాలు, సోషల్ మీడియా కంపెనీలను అటువంటి ఆర్థిక సేవల ప్రకటనలను మానుకోవాలని కోరుతూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో కేంద్రం కొత్త బిల్లుతో ముందుకు వచ్చింది. బ్యానింగ్ ఆఫ్ అన్‌రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ (బియుఎల్‌ఎబులా) పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై 2025 ఫిబ్రవరి 13 నాటికి సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. ఇందులో ఆర్‌బిఐ చట్టం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, ఎస్‌బిఐ, ఎల్‌ఐసి, ఎన్‌హెచ్‌బి, ఆర్‌ఆర్‌బి, మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు, చిట్‌ఫండ్‌లు, స్టేట్ మనీలెండర్స్‌తో సహా రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ ప్రకారం రుణకార్యకలాపాలను నియంత్రించే 20 చట్టాలను ముసాయిదా బిల్లులో పొందుపరచడమైంది. చట్టాల పరిధిలో ఉన్న ఏదైనా నియంత్రిత రుణ కార్యకలాపాలను మినహాయించడానికి నియంత్రణాధికారులతో సంప్రదించి మొదటి షెడ్యూల్‌ను సవరించడానికి కేంద్రానికి అధికారం ఇవ్వాలని ఈ బిల్లు కోరుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News