చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజలాడుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. కశ్మీర్ లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడి పోతున్నాయి. జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. నీటి సరఫరా గొట్టాల్లో నీరు గడ్డకట్టేస్తోంది. శ్రీనగర్‌లో మైనస్ 7.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండ్రోజుల్లో ఇది మరో 23 డిగ్రీల వరకు తగ్గిపోతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది. కశ్మీర్‌లో అత్యంత చల్లగా ఉండే 40 రోజుల కాలం ఈనెల 21న ప్రారంభమైంది. అప్పటి నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. అమర్‌నాథ్ యాత్రకు బేస్ క్యాంపు అయిన పహాల్గామ్‌లో మైనస్ 8.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది.
రాజస్థాన్ లోని అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. పశ్చిమ రాజస్థాన్ లోని పలు ప్రాంతాలకు అత్యంత చల్లని రోజుగా బుధవారం నిలిచిపోయింది. పంజాబ్,హర్యానాల్లోనూ శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఢిల్లీని పొగమంచు కప్పేసింది. ఢిల్లీఎన్‌సిఆర్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారు జామున 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మంచు దట్టంగా కురుస్తూ … 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కన్పించని పరిస్థితి నెలకొంది. దీంతో పలు విమానాలు,రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. వాయునాణ్యతా సూచీ (ఏక్యూఐ) 334 గా నమోదైంది.