గ్రూప్1 అభ్యర్థులకు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. రిజర్వేషన్లు తేలేంత వరకు గ్రూప్-1 ఫలితాలను ఆపాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై అభ్యంతరాలతో గ్రూప్-1 అభ్య ర్థులు ఆశ్రయించారు. గ్రూప్-1 ఫలితాలను ఆపాలన్న అభ్యర్థుల పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పుతో గ్రూప్1 ఫలితాలకు ఆటంకం తొలగినట్లైంది. జీవో నెంబర్ 29తో పాటు రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తమ పిటిషన్లపై విచారణ జరిగే వరకు పరీక్షలు వాయిదా వేయాలని ప్రభు త్వాన్ని గ్రూప్1 అభ్యర్థులు కోరారు. పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సిఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దీంతో అభ్యర్థులు చివరి నిమి షంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆఖరి నిమిషంలో పరీక్షలను వాయిదా వేయలేమని సుప్రీం కూడా తేల్చిచెప్పింది. హైకోర్టులో దీనిపై తేల్చుకోవాలని సూచించింది.
ఆ తరువాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్-1 పరీక్షలను యధావిధిగా నిర్వహించింది. హైకోర్టులో గ్రూప్1 అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై గురువారం విచారణకు వచ్చింది. గ్రూప్-1 ఫలితాలను ఆపాలన్న అభ్యర్థుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ నిర్ణ యం తీసుకుంది. అంతకు ముందుగా గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలంటూ గ్రూప్1 అభ్యర్థులు హైకోర్టు సింగిల్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. రెండు రోజులకే సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ అభ్యర్థులు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేయగా సింగిల్ బెంచ్ తీర్పుతో ఏకీభవించిన డివిజన్ బెంచ్ కూడా వారి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో పరీక్షలకు అడ్డంకులు తొలగడంతో ప్రభుత్వం ఈఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 మెయిన్ పరీక్షలు నిర్వహించింది. అయితే రిజర్వేషన్లు తేలేంతవరకు గ్రూప్-1 పరీక్షల ఫలితాలను ఆపాలంటూ అభ్యర్థులు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా వారి పిటిషన్ కొట్టివేసింది.