ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటినీ కచ్చితంగా అమలు
చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
బిఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టుచేయడం దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి, ఏడో గ్యారెంటీగా ‘ఎమర్జెన్సీ’ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బిఆర్‌ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున ఎర్రోళ్ల ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురిచేయడాన్ని కెటిఆర్ తీవ్రంగా ఖండించారు. ‘
ప్రజల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక.. నిర్బంధం, అణచివేతతో బిఆర్‌ఎస్ గొంతునొక్కే విఫల యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రోజురోజుకూ పెరిగిపోతున్న నేరాల నియంత్రణలో పూర్తిగా చేతిలెత్తేసి, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎలా నియంత్రించాలనే దానిపైనే సర్వశక్తులు ఒడ్డుతున్నారని విమర్శించారు. అక్రమంగా అరెస్టుచేసిన ఎర్రోళ్ళ శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టాలని చూసే విష సంస్కృతికి చరమగీతం పాడాలని అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి కేసులు కొత్తకాదు, అరెస్టులు అంత కన్నా కాదు.. ఆత్మగౌరవ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బెదిరింపు చర్యలకు భయపడే వారెవరూ లేరు..జై తెలంగాణ అంటూ కెటిఆర్ వ్యాఖ్యానించారు.