Sunday, December 29, 2024

ఎలక్ట్రిక్ వాహనాలకు యమ గిరాకీ

- Advertisement -
- Advertisement -

పెరుగుతున్న ఈవీ వాహనాల జోరు ఏడాదిలో 52.28 శాతం ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ల రుసుం మినహాయింపు ఫలితం, రాష్ట్రంలో పెరుగుతున్న ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్లు మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీపై ప్రభుత్వం కసరత్తు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో విద్యుత్ వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఈవీ పాలసీ వాహనదారులను ఆకర్షిస్తుండడంతో కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ల కొనుగోలు క్రమక్రమంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ తో నడిచే వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న ఈవీ కొత్త పాలసీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఈవీ వాహనాలకు రోడ్డు ట్యాక్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును రవాణా శాఖ పూర్తిగా మినహాయించింది. దీంతో సుమారు 16 రోజుల్లోనే 3,372 ఎలక్ట్రిక్ వాహనాలు రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలానికి ఆ సంఖ్య 2,708 ఉండగా కొత్త పాలసీతో 24.52 శాతం వృద్ధి నమోదైంది.

ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి రోడ్ ట్యాక్స్‌తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ఉంటుందని, వాహనాల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఈ విధానం 2026 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పోలిస్తే వీటి సంఖ్య చాలా తక్కువే. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈవీ వాహనాలపై ప్రకటించిన రాయితీల ద్వారా వీటి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా రవాణాశాఖ విజయాల్లో భాగంగా ఈవీ రిజిస్ట్రేషన్ల వివరాల్ని రాష్ట్ర సర్కార్ వెల్లడించింది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 78 వేల 262 కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరిగాయని రవాణాశాఖ తెలిపింది. అంతకముందు ఏడాదిలో 51,934 ఈవీల రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొంది.

గత ప్రభుత్వ హయాంతో పోలీస్తే తమ ఏడాది పాలనలో ఈవీల రిజిస్ట్రేషన్లు 52.28 శాతం పెరిగాయని తెలిపింది. మోటార్‌సైకిళ్లు మొదలు ఆటోల వరకు అన్ని రకాల ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్‌లో భారీగా వృద్ధి నమోదైంది. కాగా ఒక్క ఈవీ కార్ల సంఖ్యలో మాత్రమే తగ్గుదల ఉంది. పాత విధానంలోని ఫీజుల మినహాయింపు, రాయితీల విషయంలో కార్ల సంఖ్యపై పరిమితి ఉందని, ఆ కోటా దాటడంతో 2022- 23తో పోలిస్తే 2023 -24లో విద్యుత్ కార్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీల) నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై కసరత్తు చేస్తుంది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలుచేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఓ కొత్త పథకం రూపకల్పనపై కసరత్తు చేస్తుంది. మహిళలకు ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే ఓ సంస్థ ఆ శాఖ అధికారుల్ని ఇటీవల కలిసింది. కాగా ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని భరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఈ విషయం సీఎం దృష్టికి వెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఆటో డ్రైవింగ్ కొంత కష్టంగా ఉంటుంది. అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. కొంత కాలంగా ఈవీల ఉత్పత్తి పెరుగుతుంది. జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్ ఆటోల ప్లాంట్ ఒకటి ఉంది. డీజిల్, సీఎన్జీతో నడిచే ఆటోలతో పోలిస్తే ఎలక్ట్రిక్ ఆటోలను నడపడం తేలిక. దీంతో ఆ కంపెనీ, సోదర సంస్థ కలిసి ఇప్పటికే కొందరు మహిళలకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇస్తుంది. ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నవారికి వేతనం ఇచ్చి మరీ నడిపిస్తుంది. కొందరికి అద్దెకు కూడా ఇస్తుంది. కుటుంబ అవసరాల కోసం ఉపాధిని వెతుక్కుంటున్న మహిళలు డ్రైవింగ్ శిక్షణ తీసుకుంటున్నారు.

కాలుష్య సమస్యకు పరిష్కారం దిశగా

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాల్లో కాలుష్యం పెరుగుతోంది. డీజిల్ ఆటోల సంఖ్య లక్షల్లో ఉంది. హైదరాబాద్‌లో కాలుష్య సమస్య పరిష్కారంలో భాగంగా డీజిల్ బస్సులను, డీజిల్ ఆటోలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి ఓ కొత్త పథకం ఇవ్వాలని రవాణాశాఖకు తెలిపారు. కాగా మహిళలకు ఉపాధి పథకాల్లో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయించడంపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దృష్టి పెట్టింది. అయితే ఈ ప్రతిపాదిత పథకంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

మార్కెట్లో ఆదరణ పెరుగుతోంది

ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో మం చి ఆదరణ లభిస్తోందని హైదరాబాద్ ఇ సిఐఎల్‌లోని అన్విశ్రీ మో టార్స్ అధినేత ఎస్. సంగీత వెల్లడించా రు. ప్రస్తుతం రూ. 75,000 నుంచి 1,20,000 వరకు పలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు వాహనదారులకు అందుబాటులోకి వచ్చాయని, పెట్రోల్ ఖర్చు తక్కువ కావడంతోపాటు కాలుష్యం లేకుండా ఉండే వీటిపై ప్రజలు మక్కువ చూపుతున్నారని వివరించారు. కొన్ని చిన్న కంపెనీలు బ్యాటరీకి ఏడాది వారంటీతో తక్కువ ధరకు వాహనాలు విక్రయిస్తుండడంతో బ్రాండెడ్ కంపెనీల వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.


ఎస్. సంగీత, అన్విశ్రీ మోటార్స్ ఎండి

త్వరలో మార్కెట్లోకి బ్రాండెడ్ బ్యాటరీలు

బ్యాటరీ వాహనాల్లో వినియోగించేందుకు మరి కొద్ది రోజుల్లో బ్రాండెడ్ బ్యాటరీలు అందుబాటులోకి రానున్నాయని శ్రీ సాయి పవర్ సొల్యూషన్స అధినేత శ్రీనివాసరాజు వెల్లడించా రు. ప్రస్తుతం 1000 సైకిల్స్‌తో కూడిన లిధియం అయాన్, 1500 సైకిల్స్‌తో వినియోగించే లిథియం ఐరన్, ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీలను వాహనాల్లో వినియోగిస్తున్నారని చెప్పారు. ఇవి మూడు నుంచి నాలుగేళ్ల కాల పరిమితితో పనిచేస్తాయని వివరించారు. అయితే భవిష్యత్తులో సోడియం అయాన్, అల్యూమినియం ఎయిర్ బ్యాటరీలు వాహనదారులకు అందుబాటులోకి రానున్నాయని, వీటి వల్ల 30 శాతం డబ్బులు ఆదా అవుతాయని చెప్పారు. ప్రస్తుతం చైనా ను ంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలను వాహనాల్లో వినియోగిస్తున్నామని, వచ్చే ఏడాదిలో బ్రాండెడ్ కంపెనీల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే వాహనదారులకు సౌలభ్యంగా ఉంటుందని వివరించారు.


శ్రీనివాసరాజు, శ్రీసాయి పవర్ సొల్యూషన్స్ అధినేత

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News