Saturday, January 4, 2025

ఆరు గ్యారెంటీలు అడిగితే అక్రమ అరెస్టులా?:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బిఆర్‌ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఎంఎల్‌సి కవిత విమర్శించారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆదివారం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఆమె పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందూరు గడ్డ..బిఆర్‌ఎస్ అడ్డ..అని మరోసారి ప్రజలు నిరూపించారని, ఈ గడ్డకు ధన్యవాదాలు అని హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా.. అడిగితే అక్రమ కేసులు, నిలదీస్తే అరెస్టులు చేస్తోందని ధ్వజమెత్తారు. అటు కేంద్రాన్ని ఎదిరించినా కేసు భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నా కేసు, సిఎం పేరు మర్చిపోతే కేసు, రైతులు భూమి ఇవ్వకపోతే కేసు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే కేసులే.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడినా కేసులే పెడుతున్నారని మండిపడ్డారు. అయినా కేసులకు తాము భయపడేది లేదని, గట్టిగా నిలబదతామని స్పష్టం చేశారు.

దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని, కెసిఆర్‌ను ఎదుర్కోలేక కెటిఆర్‌పై, తనపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అయినా భయపడేది లేదని, తాను, కెటిఆర్ ఏ తప్పూ చేయలేదని, తమపై ఎలాంటి కేసులు పెట్టినా, ఇంకా ఎవరి మీద అయినా అక్రమ కేసులు బనాయించినా.. నిప్పుకణికల్లాగా బయటకు వస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాలు ఇందిరమ్మ ఇళ్లు పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందరని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 57 మంది పిల్లలు గురుకులాల్లో చనిపోయారని, అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగ, విద్యార్థులు అందరినీ కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ తల్లి కొత్త విగ్రహంకాంగ్రెస్ చెయ్యి గుర్తు తల్లి అని, కానీ తెలంగాణ తల్లి కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణపై, కెసిఆర్ ద్వేషభావాన్ని పెంచుకొని కాంగ్రెస్ పాలన సాగుతున్నదని మండిపడ్డారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఘన విజయం మోగించాలని, ఇందుకు నాయకులు, కార్యకర్తలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ 
రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసుల రాజ్యం నడుస్తోందని కవిత దుయ్యబట్టారు. ఒక పోలీసు అధికారిపై చేయిచేసుకున్న స్థానిక నాయకుడిపై ఎలాంటి కేసులు, అరెస్టులు లేకుండా ఉన్నాయని విమర్శించారు. గతంలో బిఆర్‌ఎస్ హయాంలో ఫ్రెండ్లీ పోలీసులు అంటే ప్రజలతో మమేకమై ఉండేవారమని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌తో పోలీసులు మమేకమై ఉన్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎంఎల్‌ఎ బిగాల గణేష్ గుప్తా, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి, బాల్కొండ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎంఎల్‌ఎ బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News