Sunday, January 5, 2025

ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్‌కు నివాళిగా..

- Advertisement -
- Advertisement -

శ్యామ్ బెనెగల్ 1934, డిసెంబర్ 14న సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతంలో జన్మించారు. 2024 డిసెంబర్ 23న 90 ఏళ్ల వయసులో ముంబై నగరంలో మరణించారు. హైదరాబాద్ నగరంలోనే బాల్యం నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఆయన విద్యాభ్యాసం జరిగింది. నిజాం కాలేజీలో చదువుకునే రోజులలోనే ఆయన అభ్యుదయ భావాల వైపు, సమానత్వ విలువల వైపు నిలబడ్డాడు. నాటక రంగంపైన అభినివేశం పెంచుకున్నాడు. ఆయన వృత్తిపర జీవితం ముంబైలో ప్రారంభమైంది. అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలతో పని చేస్తూ, అనేక సృజనాత్మక ప్రకటనలకు రూపకల్పన చేశారాయన. కాపీ రైటర్‌గా, ఆ తర్వాత ఫిలిం మేకర్‌గా ముంబైలో తన కెరియర్‌ని ప్రారంభించారు. అనేక డాక్యుమెంటరీలు తీశారు. 1974లో తన మొదటి సినిమా అంకుర్‌తో ఆయన సినీ రంగంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించారు. ఆ సినిమా తెలంగాణలోనే రూపుదిద్దుకుంది.

భారతీయ సినీ రంగంలో ప్రత్యామ్నాయ, సమాంతర సినిమాలకు ఆద్యులైన సత్యజిత్ రే, మృణాల్ సేన్‌ల దారిలోనే ఆయన కూడా వాస్తవికవాద సినిమాలను నిర్మించేందుకు సినిమా రంగంలో విప్లవాత్మక మార్పులకు పూనుకున్నారు. భారతీయ సినీరంగంలో ఆణిముత్యాల వంటి అనేక మంది నటుల్ని ఆయన తీర్చిదిద్దారు. హైదరాబాద్ నగరంతో ఆయన చివరికంటా అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. 60, 65 ఏళ్ల క్రితం తనకు మిత్రులైన వాళ్లతో ఆయన ఇంకా ఆత్మీయ సంబంధాల్లోనే ఉన్నారు. అలాంటి ఆత్మీయ స్నేహితులు రమ, శంకర్ మెల్కోటేలు, రుక్మిణి మీనన్ తమ జ్ఞాపకాలను మెహఫిల్‌తో పంచుకున్నారు. శ్యామ్ బెనెగల్ మన హైదరాబాదీ అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆయనకు నివాళి అర్పిస్తూ ‘మన తెలంగాణ’ సాహిత్య పేజీ మెహఫిల్ ప్రత్యేక వ్యాసాలను అందించాలని భావించింది. ప్రముఖ దర్శకుడు మానవీయ విలువలతో కూడిన సినిమాలను ఈ ప్రపంచానికి అందించిన, ఆర్థిక తారతమ్యాలు, ఎటువంటి వివక్షలు లేని మంచి సమాజం కావాలని కలలు కన్న శ్యామ్ బెనెగల్‌కు మెహఫిల్ నివాళి అర్పిస్తుంది.

విమల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News