ఆంధ్ర్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తూ.. ప్రజా సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేబడుతున్నారు పవన్. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో జిల్లాల్లో పర్యటించేందుకు పవన్‌కల్యాణ్ నిర్ణయించుకున్నారు. తాజాగా ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “నెలకు 14 రోజులు జిల్లాల్లో పర్యటిస్తా. ఆరు నెలల్లో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తా. ఇకపై పార్టీకి సమయం కేటాయిస్తా. నాగబాబుకు నా సోదరుడిగా కేబినెట్‌లో అవకాశం ఇవ్వలేదు. నాతో సమానంగా నాగబాబు పనిచేశారు. నాసోదరుడు కాకపోయినా, కాపు సామాజికవర్గం కాకపోయినా.. ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చేవాడిని. కందుల దుర్గేష్‌ది ఏ కులమో నాకు తెలియదు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత.. నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకే అవకాశం ఇచ్చేవాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లను.. వారసత్వంగా చూడలేం. నాతో కలిసి పనిచేసిన వారిని నేను చూసుకోవాలి. నాగబాబు విషయంలో అడుగుతారు, వైఎస్ జగన్ విషయంలో అడగరు.. వారసత్వ రాజకీయాలు అని అనడం లేదు. రాజ్యసభ సీటును నాగబాబు త్యాగం చేశారు..ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నా ఉద్దేశం. ఎమ్మెల్సీని చేశాక కేబినెట్ లోకి తీసుకుంటాం” అని పవన్ అన్నారు