Sunday, January 5, 2025

ఈ ఏడాది అవినీతిలో ఆ శాఖలదే పైచేయి

- Advertisement -
- Advertisement -

అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు
అగ్రస్థానంలో ఉన్నట్లు ఎసిబి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : 2024లో ఎసిబి పంజా విసిరింది. ప్రధానంగా ప్రభుత్వ అధికారుల అవినీతిపై దృష్టి సారించింది. ప్రభుత్వంలోని ప్రధాన శాఖలపై దృష్టి సారించింది. అందుకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చర్యలు తీసుకుంది. 170 మంది ప్రభుత్వ అధికారులు దుష్ప్రవర్తన, లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఏడాది రాష్ట్రంలో అవినీతిపై ఎసిబి ఛేదించిన కేసుల వివరాలు, సమాచారాన్ని తాజాగా పంచుకుంది.

అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. పోలీసు శాఖలో కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు 31 మంది లంచం తీసుకుంటూ పట్టుబడగా, రెవెన్యూ శాఖలో 19 మంది అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖలో 13 మంది అధికారులు, మరో ప్రధాన శాఖగా పేర్కొనే పంచాయత్ రాజ్ శాఖలో 24 మంది అధికారులు ఎసిబి వలకు చిక్కిన వారిలో ఉన్నారు. ఇక, ప్రధాన కేసుల విషయానికొస్తే..కుషాయిగూడకు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఓ కేసును క్లోజ్ చేసేందుకు రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అలాగే హైదరాబాద్ సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ రూ.15 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. రూ. 3 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటూ ఎసిబి అధికారులు చేతికి చిక్కాడు. అప్పటికే రూ. 5 లక్షలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

సంగారెడ్డి ఇన్‌స్పెక్టర్ ఓ కేసులో రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడు. ముందుగా రూ. 5 లక్షలు పుచ్చుకుంటుండగా అడ్డంగా దొరికి పోయాడు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విషయానికొస్తే… హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఎసిబి చర్యలు తీసుకుంది. అతని వద్ద 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు, బ్రాండెడ్ వాచ్‌లు, ఐఫోన్‌లు వంటి విలాసవంతమైన వస్తువులతో సహా రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వద్ద రూ.100 కోట్ల విలువైన ఆస్తులను కనుగొన్నారు. హైదరాబాద్ సిసిఎస్ ఎసిపి వద్ద రూ. 3.95 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి, చర్యలు తీసుకుంది. అదే విధంగా శామీర్‌పేట తహశీల్దార్ రూ. 20 లక్షలు లంచం డిమాండ్ చేసి రూ.10 లక్షలు నగదు తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎసిబి నిందితులుగా తేల్చిన 170 మంది ప్రభుత్వ అధికారుల్లో 12 మందిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. వారికి 1-4 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News