Sunday, January 5, 2025

భగవద్గీతలోని 700 శ్లోకాలను ఔపోసన పట్టిన శాన్వి

- Advertisement -
- Advertisement -

అభినందించిన మంత్రి కొండా సురేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: భగవద్గీతలోని 700 శ్లోకాలను ఔపోసన పట్టి, తన గాత్ర మాధుర్యంతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ పదిహేనేళ్ల ప్రాయంలోనే జాతీయస్థాయిలో ప్రతిభను చాటిన శాన్వి జమాల్ పూర్ తన తల్లిదండ్రులతో కలిసి సోమవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సురేఖకు భగవద్గీతలోని పలు శ్లోకాలను వినిపించి, భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. తాను స్వయంగా రచించిన డివైన్ వర్చుస్ ఫర్ ఎటర్నల్ పీస్ పుస్తకాన్ని మంత్రి సురేఖకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శాన్విని మనసారా అభినందించారు. పదిహేనేళ్ల వయస్సుకే శాన్వి భక్తి, ఆధ్యాత్మిక, రచనా రంగాల్లో తన ప్రతిభాపాటవాలను చాటి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం గొప్ప విషయమని మంత్రి సురేఖ కొనియాడారు. తన అభిరుచులను ఇలాగే కొనసాగించి జీవితంలో అత్యున్నత శిఖరాలను చేరుకోవాలని మంత్రి ఆశీర్వదించారు.
సావిత్రీబాయి ఫూలే జయంతోత్సవాలకు రావాలి

కొండా సురేఖకు ఆహ్వానం

రవీంద్రభారతిలో 3వ తేదీ జనవరి 2025న నిర్వహించనున్న సావిత్రీబాయి ఫూలే 194 వ జయంతోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర బిసి వుమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను సచివాలయంలో కలిసి ఆహ్వానించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలను వారు మంత్రి సురేఖకు వివరించారు. మహిళల సంక్షేమానికి, సాధికారతకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తద్వారా వారి జీవితాల్లో వస్తున్న పురోగతి గురించి వారు మంత్రి సురేఖతో వివరించారు.

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం అందించే కానుక: మంత్రి కొండా సురేఖ

తిరుమలలో తెలంగాణ సిఫార్సు లేఖలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సిఎం నారా చంద్రబాబు నాయుడుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రత్యేక దర్శనం కోసం సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగిన తమ కృషి ఫలించిందని ఆమె అన్నారు. ఎపి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడులకు మంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తనతో పాటు, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు చేసిన కృషి ఫలించడంతో మంత్రి సురేఖ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతినిత్యం అశేష భక్తజనంతో విలసిల్లే తిరమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో రాష్ట్ర ప్రజలకు ఊరట లభించినట్లైందని మంత్రి సురేఖ తెలిపారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు అందిస్తున్న ఈ సౌకర్యాన్ని సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నూతన సంవత్సర కానుక అని మంత్రి సురేఖ అభివర్ణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News