Sunday, January 5, 2025

మహిళా సంఘాల చేతికి ‘ఇందిరా మహిళా శక్తి’ చేపల విక్రయ వాహనాలు

- Advertisement -
- Advertisement -

జనవరి 3న 32 వాహనాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వారి చేత పలు వ్యాపారాలను ప్రారంభింప చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంచార చేపల విక్రయ వాహనాలను మహిళా సంఘాల కోసం సమకూర్చుతోంది. పంచాయతీ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ఆదేశాలతో సంచార చేపల విక్రయ వాహనాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సిద్ధం చేస్తోంది.

జనవరి 3న ఈ 32 వాహనాలను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ప్రారంభిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 32 వాహనాలను మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. రూ.10 లక్షల విలువ గల ఈ వాహనాలను కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకంతో అనుసంధానం చేసి, 60 శాతం సబ్సిడీతో నాలుగు లక్షల రూపాయలకే మహిళా సంఘాలకు కేటాయించనున్నారు.

ఈ నాలుగు లక్షల రూపాయలను సైతం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలను ఇప్పించనుంది. సంచార చేపల విక్రయం కోసం మహిళలకు అవసరమైన ట్రైనింగ్‌ను గచ్చిబౌలిలోని నిథం ఇనిస్టిట్యూట్లో మహిళా సంఘాలకు సెర్ప్ ఉచితంగా శిక్షణ ఇప్పించింది. చేపల విక్రమ్ తో పాటు, నోరూరించే చేపల వంటకాలు తయారీకి అవసరమైన శిక్షణను సెర్ప్ సహకారంతో పలు మహిళా సంఘాలు పూర్తి చేసుకున్నాయి. ఈ సంచార చేపల విక్రయ వాహనంలో ఉదయం పచ్చి చేపలను విక్రయించవచ్చు. సాయంత్రం చేప వంటకాలను తయారుచేసి విక్రయించుకునే విధంగా వాహనాలను ప్రత్యేకంగా తయారు చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News