Sunday, January 5, 2025

టీమిండియా చిత్తు చిత్తు

- Advertisement -
- Advertisement -

రెండో ఇన్నింగ్స్‌లోనూ టాపార్డర్ విఫలం
184 పరుగుల భారీ ఓటమిని మూటగట్టుకున్న భారత్
సిరీస్‌లో 21 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. టాపార్డర్ వైఫల్యంతో విజయం సాధించాల్సిన.. కనీసం డ్రాగా ముగించాల్సిన మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడింది. బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీలో జరిగిన నాలుగో టెస్టులోనూ 184 పరుగుల తేడా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బౌలర్లు తమ శక్తి మేరకు రాణించినా.. బ్యాటర్లు వికెట్ల ముందు తేలిపోవడంతో చిత్తుగా ఓడక తప్పలేదు. దీంతో సిరీస్‌లో 12తో వెనుక పడిపోయింది. 340 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(84) ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్(3/28), స్కాట్ బోలాండ్(3/39) మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లయన్(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, ట్రావీస్ హెడ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

పంత్ నిర్లక్షమే…

ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి గట్టెక్కేందుకు మరో 12 ఓవర్లు భారత్ క్రీజులో కొనసాగాల్సి ఉంది. ఓ దశలో రిషభ్ పంత్(30), యశస్వి జైస్వాల్ నాలుగో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యంతో కనీసం మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్నారు. అప్పటికే ఈ జోడీ దాదాపు 22 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. వీరిని విడదీయడానికి ఆసీస్ బౌలర్లు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలో పార్ట్ టైమ్ బౌలర్ ట్రావిస్ హెడ్‌కు బాలందించారు. దీంతో ఊరించే డెలివరీతో రిషభ్ పంత్‌ను పల్టీ కొట్టించాడు. నిర్లక్ష్యపు షాట్ ఆడిన రిషభ్ పంత్ వెనుదిరగడంతో అనంతరం వచ్చిన బ్యాటర్లు వెనువెంటనే పెవిలియన్‌కు క్యూకట్టారు. రవీంద్ర జడేజా, సెంచరీ హీరో నితీష్ కుమార్ రెడ్డి(1) ఔటవ్వడంతో ఈ మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బిగించింది. నిలకడగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ కూడా ఔటవ్వడంతో టీమిండియా ఓటమి ఖరారైంది.

పోరాడిన జైశ్వాల్..

లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే భారత్‌కు భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మ(9), విరాట్ కోహ్లీ(0), కెఎల్ రాహుల్(6) వరుసగా వికెట్లు పారేసుకోవడంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియా పడింది. ఈ సమయంలో యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్ ఆచితూచి ఆడుతూ.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. తొలి సెషన్‌లోనే మూడు వికెట్లు కోల్పోయినా, రెండో సెషన్‌లో మాత్రం జైశ్వాల్, పంత్ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మూడో సెషన్‌లో పార్ట్‌టైమ్ బౌలర్‌తో పంత్‌ను బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. జడేజా, నితీశ్ రెడ్డి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ జైశ్వాల్ తన పోరును కొనసాగించాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు ప్రయత్నించాడు. కానీ వివాదాస్పద రీతిలో జైశ్వాల్ ఔట్ కావడంతోఆసీస్ విజయం సునాయాసమైంది.

ఆసీస్‌కు భారీ ఆధిక్యం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల భారీ స్కోర్ చేయగా.. భారత్ 369 పరుగులకు ఆలౌటైంది. నితీష్ కుమార్ రెడ్డి అసాధారణ సెంచరీతో భారత్ ఈ మ్యాచ్‌లో పట్టు సాధించింది. 105 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 340 పరుగుల భారీ ఆధిక్యం అభించింది. టీమిండియా చెత్త ఫీల్డింగ్‌కు తోడు సెకండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో టీమిండియాకు విజయావశాలు దూరమయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News