Sunday, January 5, 2025

సకారాత్మక మార్పులకు కొత్త ఏడాది వేదిక

- Advertisement -
- Advertisement -

ఈ ఏడాది చరిత్రలో కలిసిపోతూ, 2025 తెర మీదికి వస్తున్నది. కొత్త సంవత్సరం కోటి ఆశల మూటలు తోడ్కొని రావాలని కోరుకుంటున్నాం. వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన, కుటుంబపరమైన బాధ్యతలతో జీవితం పయనిస్తున్నది. వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఇతర రంగాల్లో ముందుకు పోగలుగుతాం. కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి పోతున్న వేళ మనం రానున్న 12 నెలల్లో వ్యక్తిగత శారీరక, మానసిక ఆరోగ్యానికి తీసుకోవలసిన నిర్ణయాలను నేడు దృఢ కంపల్పంతో తీసుకుందాం. మన జీవనశైలిని మరింత సానుకూల దిశగా దశల వారీగా మార్చుకుందాం, ఆరోగ్య సౌభాగ్యాలను పెంచుకుందాం. మనం తీసుకోవలసిన లక్ష్యాలు అతి క్లిష్టమైనవి లేదా అతి సులభమైనవిగా ఉండకూడదు. అసాధ్యమైన లక్ష్యాలను ఎంచుకున్నపుడు వైఫల్యాలు వెక్కిరించి మానసిక విశ్వాసం సన్నగిల్లుతుంది. స్వల్ప లక్ష్యాలను ఎంచుకున్నపుడు మన శక్తి సామర్థ్యాలు పూర్తిగా వినియోగపడవు. నేటి అసౌకర్యం రేపు సానుకూల సౌకర్యంగా మారి మన జీవనశైలిని సుసంపన్నం చేయాలి.

దిన చర్యకు మెరుగులు దిద్దుదాం

దిన చర్యను నిశితంగా పరిశీలిద్దాం. అవసరమైన స్వల్ప మార్పులను చేసుకుందాం. మన కండర, మానసిక ఆరోగ్యానికి వేకువ జామున నిద్ర లేచే ప్రయత్నం చేద్దాం. ఉదయ భానుడి కిరణాలు సోకుతున్న వేళల్లో సైక్లింగ్, వాకింగ్ లేదా స్విమ్మింగ్, జాగింగ్, యోగా, ప్రాణాయామం, లేదా ధ్యానం చేయడానికి సమయం కేటాయిద్దాం. నిన్నటి కన్న నేడు కుటుంబంతో గడిపి సమయాన్ని పెంచుదాం. మన ఆదాయ వ్యయాలను అధ్యయనం చేసి అనవసర వ్యయాలను తగ్గిస్తూ పొదుపుకు పట్టం కడదాం. ప్రతి రోజు సరైన నిద్రకు తగు సమయాన్ని కేటాయిద్దాం. నిద్ర లేమి సమస్య పలు అనారోగ్యాలకు హేతువు అవుతుందని తెలుసుకుందాం. మన ఎదుగుదలకు ఉపకరించే నూతన అభిరుచులను పెంచుకోవడానికి కొత్త వ్యక్తులతో లేదా సృజనశీల సమూహాలతో సంబంధాలను పెంచుకుందాం.

దురలవాట్లకు దూరం జరుగుదాం

పొగ లేదా మద్యం తాగే అలవాటుగా వారు దానిని 2025లో తగ్గించడానికి కఠిన నిర్ణయాలు తీసుకొని అమలు పరుద్దాం. పీచు పదార్థాలు అధికంగా ఉన్న శాకాహారాలను మన మెనూలో చేర్చుదాం. ఏడాదిలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షకు చేసుకునే అలవాటును 2025లోనైనా ప్రారంభిద్దాం. మన ఇంటి లేదా కార్యాలయ లేదా విద్యాలయ ప్రాంగణాల్లో ఒకటి లేదా అంత కన్న ఎక్కువ మొక్కలను దత్తత తీసుకొని వాటి ఆలనాపాలనా చూసుకుంటూ మానసిక సంతోషాన్ని పెంచుకుందాం.
మన ఇంటికి లేదా కార్యాలయానికి చేరుకోవడానికి లిఫ్ట్కు బదులు మెట్ల మార్గాలను ఎంచుకొని ఆరోగ్యాలను పదిల పరుచుకుందాం.

ఏడాదిలో కనీసం రెండు సార్లు సెలవుల్లో కొత్త ప్రదేశాలను దర్శించడానికి ప్రయాణ ప్రణాళికలు అమలు పరుద్దాం. మనం ప్రేమించే వ్యక్తులతో పాటు మనల్ని ప్రేమించే వ్యక్తులతో గడపడానికి కొంత సమయం కేటాయిద్దాం. రోజు దాదాపు 4 లీటర్ల నీటిని తాగడానికి, శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి కఠిన నిర్ణయాలను జనవరి 01, 2025 రోజున తీసుకుందాం. నూతన సంవత్సర వేడుకల్లో అత్యుత్సాహంతో పాల్గొనకుండా కొంత సమయాన్ని కేటాయించి 2025లో అమలు పరచవలసిన నూతన జీవనశైలి మార్పుల గూర్చి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుందాం, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని రుజువు చేద్దాం.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News