Sunday, January 5, 2025

మహత్తరమైనది మాతృభాష

- Advertisement -
- Advertisement -

బుడిబుడి నడకలు వేసే పిల్లవాడికి తల్లిదండ్రులే తొలి గురువులు. అమ్మ, అత్త, తాత, నాన్న వంటి పదాలు నేర్పుతూ, మాతృభాషను పిల్లవాడు త్వరితగతిన నేర్చుకునేందుకు దోహదం చేస్తుంటారు. ఇంట్లో కుటుంబసభ్యులందరూ మాట్లాడేది మాతృభాషే అయినప్పుడు పిల్లవాడు కూడా భాష ను సునాయాసంగా అలవరచుకుంటాడు. కానీ, విద్య, ఉద్యోగావకాశాలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులే ‘ముందుచూపు’తో పిల్లవాడిపై ఆంగ్లభాషను రుద్దుతున్నారు. అమ్మ, నాన్న వంటి పదాలు నేర్పడానికి బదులు మమ్మీ, డాడీ అంటూ ఆంగ్లపదాలతో పసిమనసులో గందరగోళం సృష్టిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు ఇంట్లో మాతృభాషను నేర్పుతున్నా, మూడో ఏడాది వచ్చేసరికల్లా పిల్లవాణ్ని ఇంగ్లీషు మీడియం స్కూల్లో వేస్తున్నారు.

ఫలితంగా, ఏ భాష మీదా పట్టు సంపాదించలేక పిల్లలు రెంటికీ చెడిన రేవడిలా తయారవుతున్నారన్న భాషా శాస్త్రవేత్తల హెచ్చరికలు అరణ్యఘోషే అవుతున్నా యి. ఏ భాష నేర్చుకోవడానికైనా మాతృభాష పునాదివంటిది. మాతృభాష బాగా నేర్చుకున్న పిల్లవాడు ఇతర భాషలనూ నేర్చుకుంటాడన్న ఇంగితం తల్లిదండ్రులకు పట్టడం లేదు. ఈ నేపథ్యంలో విజయవాడ వేదికగా రెండు రోజులపాటు జరిగిన ఆరవ ప్రపంచ తెలుగు మహాసభలు మాతృభాష ప్రాధాన్యాన్ని, తెలుగును కాపాడుకోవలసిన అవసరాన్ని, అగత్యాన్ని నొక్కిచెప్పడం ఎంతైనా ముదావహం.

భారత రాజ్యాంగంలోని 345వ అధికరణం.. రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి అధికారమిచ్చింది. ఇందులో భాగంగానే తెలుగును పరిపాలనా భాషగా చేసేందుకు యాభయ్యేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1966లోనే తెలుగు అధికారభాషగా గుర్తిం పు పొందింది. ప్రభుత్వ శాఖలు ఇకపై తెలుగులోనే ఉత్తర ప్ర త్యుత్తరాలు నడపాలని అప్పట్లోనే తీర్మానించినా, ఇప్పటికీ అ నేక కార్యాలయాలు, న్యాయస్థానాల్లో ఆంగ్లానిదే అగ్రస్థానం. పాలకుల భాష, పాలితుల భాష వేర్వేరుగా ఉండటంవల్ల సా మాన్యుడికి ప్రయోజనం చేకూరడం లేదనేది వాస్తవం. సగటు మనిషికి తన సమస్యను మాతృభాషలో చెప్పుకునే వీలు ఉం డాలి.

అధికారులు సైతం ప్రజలకు మాతృభాషలోనే వివరిం చే వెసులుబాటు ఉండాలి. ప్రభుత్వ కా ర్యకలాపాలు, న్యాయస్థానాల్లో రాతకోతలన్నీ ఆంగ్లభాషలో జరుగుతున్నప్పుడు మాతృభాషను నేర్చుకుని ప్రయోజనం ఏమిటన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బా ధ్యత ప్రభుత్వాలదే. ప్రభుత్వ కార్యాలయాల్లో చిరు ఉద్యోగు లు మొదలుకుని ఉన్నతాధికారుల వరకూ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆంగ్లంలోనే సాగుతున్నాయన్నది నిర్వివాదాంశం. కోర్టు పరిభాష ఇప్పటికీ సగటు మనిషికి కొరుకుడు పడటం లేదు. జిల్లా కోర్టుల వరకూ వాదనలు, తీర్పులూ మాతృభాషలోనే వెలువరించేందుకు అక్కడక్కడ ప్రయత్నాలు జరుగుతున్నా, ప్రభుత్వపరంగా చేయూత కొరవడుతోంది. ఆంగ్లంలో ఉన్న న్యాయశాస్త్రాన్ని, చట్టాలను తెలుగీకరించి, వాదనలు, తీర్పులు తెలుగులో వెల్లడిస్తే సామాన్యుడికి కాస్త వెసులుబాటుగా ఉంటుంది. వాడుక లేకపోవడమే మాతృభాష వినాశనానికి దారితీస్తోంది.

దీనికితోడు, ఆంగ్లభాషలోని అనేక పదాలకు తెలుగు అర్థాలు లేకపోవడంవల్ల తెలుగు మాట్లాడేవారు అనివార్యంగా ఆంగ్ల పదాలను అరువు తెచ్చుకోవలసిన దుస్థితి ఏర్పడుతోంది. ఈ విషయమై భాషాశాస్త్రవేత్తలు దృష్టి సారించి, కొత్త పదాల సృష్టికి పూనుకోవాలి. ప్రభుత్వ తోడ్పాటు ఉంటనే ఇది సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారి సంఖ్య తొమ్మిది కోట్ల పైచిలుకే. ప్రపంచభాషల్లో 17వ స్థానాన్ని తెలుగు భాష ఆక్రమించడం తెలుగువారందరికీ గర్వకారణం. అయినప్పటికీ పరభాషా వ్యామోహం కారణంగా తెలుగు భాష అంతరించిపోతోందన్న వాస్తవాన్ని మరచిపోకూడదు. కనీసం ముప్ఫై శాతం పిల్లలు మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టేనని యునెస్కో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భ ంగా గమనార్హం. ఆ విధంగా చూస్తే, ప్రస్తుతం తెలుగు భాష ప్రమాదంలో పడిందనే చెప్పుకోవాలి.

ఈ ప్రమాదం ఒక్క తెలుగుకే కాదు, ఆంగ్ల భాషాప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న అనేక భాషలది ఇదే పరిస్థితి. తెలుగులో మాట్లాడటం ఆత్మన్యూనతగా భావిస్తూ, ఇంగ్లీషులో మాట్లాడటమే గౌరవమనే భావననుంచి తెలుగువారు బయటపడాలి. ఇప్పటికీ చైనా, జపాన్ వంటి దేశాలు మాతృభాషలకే పట్టంగడుతున్న విషయం విస్మరించరానిది. పరాయి భాషలో మా ట్లాడే ప్రతి మాటా గుర్తు తెచ్చుకుని మాట్లాడతాం, కానీ మా తృభాష నిద్రలో సైతం అసంకల్పితంగా వస్తుంది. మాతృభాషకు, పరభాషకు మధ్య గల ఈ అంతరాన్ని ప్రతి ఒక్కరూ గ మనించి, మాతృభాష ప్రాధాన్యాన్ని, ప్రాముఖ్యతను గుర్తించాలి. మాతృభాష తల్లిపాలవంటిది, పరభాష పోతపాలవంటిదన్న మహనీయుడు కొమర్రాజువారి మాటలు అక్షర సత్యాలు!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News