Sunday, January 5, 2025

4న కేబినెట్ భేటీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సచివాలయంలో జనవరి 4న సా యంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రైతు భరోసా, భూమి లేని పేదలకు నగదు బదిలీపై చర్చించనున్నట్లు సమాచారం. రైతు భరోసాకు అర్హతలు, కొత్త విధివిధానాలతో పాటు భూమి లేని పేదలను గుర్తించడం తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డిసెంబరు30నే మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి కారణంగా కే బినెట్ భేటీ వాయిదా పడింది. తెలంగాణ శాసనసభ ఆయన మృతి పట్ల వారి కుటుంబానికి సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. కొత్త రేషన్ కార్డులకు ఆదాయ పరిమితి, దరఖాస్తుల స్వీకరణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు సబ్సిడీ ధరలతో ఇసుక, సిమెంట్, స్టీలు తదితర ముడి సరుకులు సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై కేబినెట్ చర్చకు రానున్నట్లు సమాచారం.

విద్యుత్ కమిషన్, బీసీ డెడికేటెడ్ కమిషన్, ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలపై చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవాలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయానికి 20 మందితో పాలక మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూతన టూరిజం పాలసీపై కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. కొత్త టూరిజం పాలసీపై ఇటీవల శీతాకాలం సమావేశాల్లో అసెంబ్లీలోనూ చర్చించారు. భూమి లేని పేదలకు రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిని డిసెంబరు నెలలోనే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించినప్పటికీ అది అమలు కాలేదు. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికల లాంటి ప్రధాన అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News