Tuesday, January 7, 2025

‘గేమ్ చేంజర్’తో వింటేజ్ శంకర్‌ని చూస్తాం: రాజమౌళి

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు గేమ్ చేంజర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ “శంకర్‌ఫస్ట్ తెలుగు సినిమా అని అంతా చెబుతుంటే.. అవునా? నిజమా? అని అనిపించింది. కానీ తెలుగు వాళ్లకి శంకర్ తమిళ దర్శకుడు కాదు.. మన తెలుగు దర్శకుడే. శంకర్ అంటే తెలుగు వారందరికీ గౌరవం.

ఆ గౌరవంతోనే దిల్ రాజు ఈ మూవీని శంకర్‌తో తీసి ఉంటారు. ప్రస్తుతం ఉన్న కుర్ర దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేం మాత్రం శంకర్‌ని చూసి గర్వపడుతుంటాం. ఆయనే డైరెక్టర్లకు ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. మనకున్న పెద్ద కలల్ని సినిమాగా తీస్తే.. డబ్బులు వెనక్కి వస్తాయని అందరికీ నమ్మకాన్ని ఇచ్చిన డైరెక్టర్ శంకర్. ఈ మూవీతో వింటేజ్ శంకర్‌ని చూస్తాం. మగధీర నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు రామ్ చరణ్ ఎంతో ఎదిగి పోయాడు. జనవరి 10న థియేటర్లలోకి గేమ్ చేంజర్ రాబోతోంది. అందరూ థియేటర్లలో చూడండి” అని అన్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ “గేమ్ చేంజర్ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, మాస్, ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.

రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. అందరూ శంకరాత్రి అని అంటున్నారు. కానీ ఇది రామ నవమి. రామ్ చరణ్ తన పాత్రల్లో ఒదిగిపోయారు. అక్కడ రామ్ చరణ్ కాకుండా మీకు ఆ పాత్రలే కనిపిస్తాయి. అంత అద్భుతంగా కనిపిస్తారు. అంజలి తన నటనతో పాత్రకు జీవం పోశారు. ఎస్ జే సూర్య అద్భుతంగా నటించారు. నన్ను తెలుగుకి పరిచయం చేసినందుకు దిల్ రాజుకి థాంక్స్. రెహమాన్ లేడనే లోటు నాకు తెలియకుండా తమన్ నా నమ్మకాన్ని నిలబెట్టి సంగీతం ఇచ్చారు. ఆర్‌ఆర్ అద్భుతంగా ఇచ్చారు”అని తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ “రాజమౌళి, శంకర్ ఏ విషయంలోనూ రాజీపడరు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారు.

ఇద్దరూ చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సముద్రఖని, అంజలి, కియారా ఇలా ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడంతోనే సినిమాకు ఇంతటి అందం వచ్చింది. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు”అని పేర్కొన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. “తమిళ్ సినిమాను శంకర్ పాన్ ఇండియాగా చేశారు. రాజమౌళి తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశాం. ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే. అసలు మ్యాటర్ ఏంటో జనవరి 10న తెలుస్తుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అంజలి, ఎస్.జె.సూర్య, సముద్రఖని, ఎస్.తమన్, సాయి మాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News