Tuesday, January 7, 2025

వేగంగా కుదుటపడుతున్న సిరియా

- Advertisement -
- Advertisement -

సిరియన్లలో అత్యధికులు సున్నీలు కాగా, షియాలు, కుర్దులకు సంబంధించి సమస్యలు తేలికగా పరిష్కారం కాకపోవచ్చు. అస్సాద్ షియా తెగకు చెందినవాడు. కనుక తమపై కక్ష సాధింపు చర్యలు ఉండవచ్చుననే భయంతో అస్సాద్ చెందిన అలావీ షియాలు, ఇతర షియాలు దేశం వదిలి పారిపోతున్నట్లు వార్తలు చెప్తున్నాయి. కనుక వారికి భరోసా కల్పించవలసి ఉంటుంది. మరొక వైపు ఈశాన్య ప్రాంతంలో విస్తారంగా గల కుర్దులను అమెరికా తన పలుకుబడితో ఉంచుకొనగా, వారితోపాటు తమ దేశంలోని కుర్దులు కలిసి టర్కీ సమగ్రతకు ముప్పు తెస్తున్నట్లు భావించే టర్కీ, రెండు వైపుల గల కుర్దులనూ అణచివేయజూస్తున్నది.

సిరియాతో పాటు కుర్దులు, అమెరికా, టర్కీలను మధ్య రాజీ కుదిరితే తప్ప ఈ సమస్య తేలదు. అందువల్ల ఈ విషయం తగినంత సమయం తీసుకోవచ్చు. సిరియా కొత్త నాయ కత్వం ఎదుట గల మరొక రెండు సమస్యలు రష్యా, ఇరాన్‌తో ఎట్లా వ్యవహరిం చటమన్నది ఒకటైతే, ఇటీవలి పరిణామాలను అనువుగా చేసుకుంటున్న ఇజ్రా యెల్, సిరియాకు చెందిన గోలన్ కనుమల ప్రాంతాన్ని మరింతగా ఆక్రమించు కుంటూ తామిక అక్కడి నుంచి ఖాళీ చేయబోమని బాహాటంగా ప్రకటించటం.

నియంత అస్సాద్‌ను కూలదోసి ఈ నెల 8కి నెల రోజులు పూర్తి చేసుకోనున్న సిరియా మొదట భావించిన దాని కన్నా వేగంగా కుదుటపడుతుండటం గమనించదగ్గది. ఈ పరిణామం కొత్త ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకే గాక మొత్తం పశ్చిమాసియాకు, ప్రపంచానికి కూడా సంతోషించవలసిన విషయమవుతున్నది. దీని అర్థం సిరియా ఎదుట గల సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయనో, ఆ పని త్వరగా జరిగిపోతుందనో కాదు. సమస్యలు తీవ్రమైనవి. అవి పరిష్కారం అయ్యేందుకు తగినంత సమయం అవసరం. బహుశా చాలా కాలమే తీసుకోవచ్చు. కాని, కొత్త నాయకత్వం తీసుకుంటున్న వైఖరి, అందుకు అనుగుణంగా చెప్తున్న మాటలు, చేస్తున్న చర్యలు మాత్రం ఆశాభావాన్ని కలిగిస్తున్నాయి.

అన్నింటి కన్నా ముందు గమనించవలసిన విషయాలు కొన్నున్నాయి. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన హయాత్ తహరీర్ అల్ షామ్ (హెచ్‌టిఎస్) గ్రూపు అధినేత అబూ మొహమ్మద్ అల్ జూలానీ తన ఈ విధమైన అజ్ఞాత యుద్ధ కాలపు మారు పేరును, తిరుగుబాటు విజయవంతమైన మరునాడే వదలుకుని, తన అసలు పేరు అహమద్ అల్ షరాకు వెంటనే మార్చుకున్నాడు. దేశంలోని అందరు ప్రజలు ఒకటేనని, తాము అన్ని జాతులు, తెగలు, మతాలు, వర్గాలకు ఒకటి చేసి అందరి మేలు కోసం పరిపాలించగలమని అదే రోజు ప్రకటించాడు. మహిళలపై ఎటువంటి వివక్ష ఉండదని కూడా స్పష్టం చేశాడు. ఈ కొద్ది పాటి మాటలతోనే ఆయనను సిరియన్ ప్రజలతోపాటు ప్రపంచంలో అనేకులు కొత్త దృష్టితో చూడటం మొదలైంది. ఆ విధంగా ఒక్క రోజులోనే సానుకూల దృష్టిని సంపాదించుకున్న అహమద్ అల్ షరా, అప్పటి నుంచి ఈ సరికి 25 రోజులు గడిచిన కాలంలోనూ అదే విధమైన వైఖరిని కొనసాగించాడు.

ఆయనకు, హెచ్‌టిఎస్‌కు వారు 13 సంవత్సరాల క్రితం తిరుగుబాటు ప్రారంభించినపుడు ఐక్యరాజ్య సమితి, అమెరికా శిబిరంతోపాటు అనేక దేశాలు టెర్రరిస్టు ముద్ర వేశాయి. అందుకు తగినట్లు ఆ సంస్థకు అల్ కాయెదా, ఐఎస్‌ఐఎస్ వంటి సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలుండేవి. అహమద్ షరాపై అమెరికా కోటి డాలర్ల బహుమతి కూడా ప్రకటించింది. సిరియా ఈశాన్య ప్రాంతంలోని కుర్దులను పోటీ దళాలుగా తయారు చేసి అన్ని విధాలుగా సహాయం చేసింది. టర్కీ తన గ్రూపును తాను నిర్మించింది. అస్సాద్ షియా అయినందున అరబ్ రాజ్యాలు సున్నీ గ్రూపులకు సహాయం చేశాయి. అస్సాద్ కాలంలో మరి కొన్ని తిరుగుబాటు గ్రూపులు ఏర్పడ్డాయి. ఇటువంటి అల్లకల్లోలపు పరిస్థితుల మధ్య ఇంచుమించు ఒక్క చేతితో అస్సాద్‌ను కూలదోసిన అహమద్ షరా, ఈ గ్రూపులన్నింటిని ఒకటి చేయచూడటం పెద్ద సవాలుగా మారింది. అదే విధంగా తమకు గల టెర్రరిస్టు ముద్రను తొలగింపజేసుకోవటం.

ముందు గా ఇవి జరిగితే గాని, అస్సాద్ కాలంలో సిరియాపై ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా తదితర దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు పోవటానికి, ఆ దరిమిలా దేశాభివృద్ధి కోసం చర్యలకు అవకాశం వుండదు. ఈ పాతిక రోజులుగా కొత్త నాయకుడు చేస్తూ వస్తున్నది అదే. తమ పట్ల సిరియన్లకు, బయటివారికి విశ్వాసం ఏర్పడేందుకు వెంటనే ఖైదీలందరినీ విడుదల చేయించాడు. మహిళల వస్త్రధారణ, విద్యాభ్యాసంపై ఆంక్షలు రద్దు చేశాడు. వివిధ రకాల పౌర స్వేచ్ఛలను పునరుద్ధరింప చేశాడు. అస్సాద్‌కు పూర్తి మద్దతుగా ఉండిన రష్యా, ఇరాన్‌లతో సహా అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉండగలవని ప్రకటించాడు. ఈ పనులు చేస్తూ, సిరియాపై, వ్యక్తిగతంగా తనపై గల ఆంక్షలు ఎత్తివేయవలసిందిగా అందరినీ కోరాడు. సిరియా భౌగోళికంగా కీలక ప్రదేశంలో ఉంది. అందువల్ల పైన పేర్కొన్న ప్రకటనలు, చర్యలను గమనించటంతో అరబ్ రాజ్యాలు, పాశ్చాత్య దేశాలు తమ రాయబార కార్యాలయాలను ఒకదాని వెంట ఒకటి వేగంగా తెరిచాయి. వివిధ దేశాల దౌత్యప్రతినిధులు డమాస్కస్‌కు చేరి అహమద్ షరాతో సమావేశమయారు. అమెరికా ప్రతినిధి బృందం సైతం ఆయనను కలవటమే గాక తనపై గల కోటి డాలర్ల రివార్డును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకారం టెర్రరిస్టు ముద్ర కూడా తొలగిపోయింది.

ఈ సానుకూల పరిణామాలన్నీ ఇంత త్వరగా చోటు చేసుకోవటం సాధారణ విషయం కాదు. ఒకవైపు ఇవి జరుగుతుండగానే మరొక వైపు అహమద్ షరా, దేశంలోని అన్ని గ్రూపులను సమావేశపరచి, అన్ని ఒకటిగా విలీనం కావాలని, కొత్త సిరియా సైన్యంగా రూపొందాలని కోరాడు. అందుకు దాదాపు అన్ని గ్రూపులు అంగీకరించటం మారుతున్న పరిస్థితులను సూచిస్తున్నది. తమ హెచ్‌టిఎస్ గ్రూపును కూడా రద్దు చేయనున్నట్లు ఆయన అదే సమావేశంలో ప్రకటించాడు. ఈ క్రమం రానున్న కాలం లో పూర్తి కాగలదని భావించవచ్చు. అయితే, ఈ క్రమానికి సంబంధించి రెండు చిక్కు సమస్యలు కూడా ఉన్నాయి. సిరియన్లలో అత్యధికులు సున్నీలు కాగా, షియాలు, కుర్దులకు సంబంధించి సమస్యలు తేలికగా పరిష్కారం కాకపోవచ్చు. అస్సాద్ షియా తెగకు చెందినవాడు. కనుక తమపై కక్ష సాధింపు చర్యలు ఉండవచ్చుననే భయంతో అస్సాద్ చెందిన అలావీ షియాలు, ఇతర షియాలు దేశం వదిలి పారిపోతున్నట్లు వార్తలు చెప్తున్నాయి.

కనుక వారికి భరోసా కల్పించవలసి ఉంటుంది. మరొక వైపు ఈశాన్య ప్రాంతంలో విస్తారంగా గల కుర్దులను అమెరికా తన పలుకుబడితో ఉంచుకొనగా, వారితోపాటు తమ దేశంలోని కుర్దులు కలిసి టర్కీ సమగ్రతకు ముప్పు తెస్తున్నట్లు భావించే టర్కీ, రెండు వైపుల గల కుర్దులనూ అణచివేయజూస్తున్నది. సిరియాతోపాటు కుర్దులు, అమెరికా, టర్కీలను మధ్య రాజీ కుదిరితే తప్ప ఈ సమస్య తేలదు. అందువల్ల ఈ విషయం తగినంత సమయం తీసుకోవచ్చు. సిరియా కొత్త నాయకత్వం ఎదుట గల మరొక రెండు సమస్యలు రష్యా, ఇరాన్‌తో ఎట్లా వ్యవహరించటమన్నది ఒకటైతే, ఇటీవలి పరిణామాలను అనువుగా చేసుకుంటున్న ఇజ్రాయెల్, సిరియాకు చెందిన గోలన్ కనుమల ప్రాంతాన్ని మరింతగా ఆక్రమించుకుంటూ తామిక అక్కడి నుంచి ఖాళీ చేయబోమని బాహాటంగా ప్రకటించటం. అదే విధంగా సిరియన్ సైనిక కేంద్రాలు, ఆయుధాగారాలపై వందలాది దాడులు జరుపుతూ వారి బలాన్ని ధ్వంసం చేయటమే లక్షమని చెప్తూ, సిరియా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించటం. ఇది తగదని ఐక్యరాజ్యసమితితో పాటు యూరోపియన్ దేశాలు ఖండించినా లెక్కచేయకపోవటం. సిరియా కొత్త ప్రభుత్వం ఈ చర్యలను ఎదుర్కొనే శక్తి లేక సాధారణ నిరసనలకు పరిమితమవుతున్నది. ఇది చివరకు ఏ విధంగా పరిణమించవచ్చునన్నది పెద్ద సవాలే.

పోతే, అస్సాద్‌కు మద్దతునిచ్చిన రష్యాకు సిరియాలో మధ్యధరా సముద్ర తీరాన టార్టస్ వద్ద ఒక నౌకాస్థావరం, హెమెయితిమ్ వద్ద ఒక వైమానిక స్థావరం ఉన్నాయి. వాటిని మూసివేయవలసిందిగా కొత్త ప్రభుత్వం ఏమీ ఆదేశించలేదు గాని, రష్యా మాత్రం తన యుద్ధ విమానాలను మరొక మధ్యధరా సముద్ర తీర దేశమైన లిబియాకు తరలించటం మొదలుపెట్టింది. చివరకు ఏమి జరిగేదీ వేచిచూడవలసిన విషయం. కొత్త ప్రభుత్వంతో సంబంధాల కోసం ఇరాన్ ఆరంభించిన ప్రయత్నాలు ఏమయేదీ కూడా కొంత కాలానికి గాని స్పష్టత రాదు.

చివరకు మిగిలే దీర్ఘకాలిక సమస్య ఆర్థికాభివృద్ధి, పేదరికం తగ్గింపు. సిరియాలో గల సహజ వనరులు ఇంత కాలం సరిగా వినియోగానికి రాకపోవటమో, దోపిడీకి గురి కావటమో జరిగింది. దేశంలో 80 శాతం పేదరికం ఉన్నట్లు అంచనా. ఈ పరిస్థితులు మారుటానికి అరబ్ దేశాలు, పాశ్చాత్య కూటమి తగు సహాయం దీర్ఘ కాలం పాటు చేస్తూపోవటంతో పాటు కొత్త ప్రభుత్వం సమర్థవంతంగా పాలించవలసి ఉంటుంది. అహమద్ షరా సూచించినట్లు రాజ్యాంగ రచన, ఎన్నికల నిర్వహణకు నాలుగేళ్ళుపట్టినా, ఈలోగా ఆయన ఇంత వరకు చూపిన వేగాన్నే పరిపాలనలోనూ చూపవలసి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News