Tuesday, January 7, 2025

పుస్తకాల వనం ‘బుక్ ఫెయిర్’

- Advertisement -
- Advertisement -

గత నెల డిసెంబరులో పదకొండు రోజులు సాగిన పుస్తకాల పండుగలో అన్ని భావజాలాల, మతాల, భాషల పుస్తకాలు పక్కపక్కనే కొలువుదీరాయి. పుస్తకాల్లో ఉన్నది ఏదైనా ఒక రచనగా దానిని గౌరవిస్తూ విక్రేతలంతా కలుపుగోలుగా ఉన్నారు. విక్రేతలది వ్యాపారమే తప్ప భావజాల వ్యాప్తి వారి పాత్ర లెక్కలోకి రాదు. అందుకే తమ వద్ద లేని పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో స్టాల్ నెంబర్‌తో సహా సూచించి ఒకరికొకరు సాయపడ్డారు. అది అభ్యుదయమైనా, ఆధ్యాత్మికమైనా వారికి ఒకటే. ఇక్కడ పుస్తకం అమ్మబడాలి అనేది స్టాల్‌కు, చదవబడాలి అనేది రచయితకు ముఖ్యం. పఠనం పెరిగి భావజాలాల చర్చల ద్వారా వాస్తవం, యథార్థం, నిజం బయటపడాలి. అది మానవజాతి సామరస్యతకు తోడ్పడాలి. పుస్తక ప్రదర్శన లక్ష్యం కూడా అదే.
అలాంటి సుహృద్భావ వాతావరణంలో బెదిరింపులకు తావు లేదు.

ఫలానా పుస్తకం ఎందుకు అమ్ముతున్నావని అడిగే హక్కు ఎవరికీ లేదు. రచనలు, ప్రసంగాలు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనలో భాగమే. అది పౌరుల హక్కు. దాన్ని అడ్డుకోవడం నేరం. అయితే బుక్ ఫెయిర్ చివరి రోజున ఒక ఊహించని సంఘటన జరిగింది. ‘తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే’ అన్న అనువాద గ్రంథం అమ్మకాలపై కొందరు స్టాళ్ల ముందుకు వచ్చి వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ పుస్తకాన్ని సమాంతర ప్రచురణ ద్వారా వెలువడింది. సమాంతర స్టాల్ సహా మరి కొన్ని చోట్ల ఈ పుస్తకాన్ని అమ్మకానికి పెట్టారు. చివరగా ఆ కొందరు వీక్షణం స్టాల్ వద్ద దురుసుగా ప్రవర్తించినట్లు రచయిత ఎన్ వేణుగోపాల్ వెల్లడించారు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, దురుద్దేశంతో జరిగింది. వాదన మొదలైన క్షణం నుంచే ఆ సన్నివేశాన్ని వారిలో ఒకరు వీడియో తీశారు. అది నిన్నటి నుంచి సంఘ్ పరివార్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నది. నిజానికి అనుమతి లేకుండా వీడియో తీయడం, దాన్ని వైరల్ చేయడం సైబర్ నేరం అని ఆయన తన ఫెస్ బుక్‌లో పేర్కొన్నారు.

అడిగేవారు ముందు ఆ పుస్తకాన్ని చదవాలి. అందులో ఉన్న అంశాలను విభేదిస్తే రచయితతో చర్చించాలి. పుస్తకాన్ని విశ్లేషిస్తూ పత్రికలకు రాయవచ్చు. సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడవచ్చు. రచయితను, ముద్రణా సంస్థను అడగకుండా మార్కెట్‌లో వాటిని అమ్ముకొనేవారిని ప్రశ్నించడం పద్ధతి కాదు. పుస్తకం రాకలో రచయిత, ముద్రాపకుడు, అమ్మకందారు ఉంటారు. అందులో చివరివాడు కమీషన్‌పై బతుకుతాడు. బుక్ ఫెయిర్ స్టాల్‌కు వేల రూపాయల కిరాయి కట్టి, దూర ప్రాంతాల్లోంచి పుస్తకాలను రవాణా చేసి, చివరకు లాభమో, నష్టమో అన్నిటికీ సిద్ధపడినవారు ఈ అసహనజీవుల లక్ష్యం కాకూడదు. ఫలానా పుస్తకం అమ్మొద్దని స్టాల్ వద్ద వాగ్వాదానికి, బెదిరింపులకు దిగడం పూర్తిగా తప్పు. వీలైతే ఆ రచయితను అడగాలి. మనోభావాలకు బాధకలిగితే కోర్టును ఆశ్రయించవచ్చు.

ఇక ఆ పుస్తకాన్ని విషయానికొస్తే ‘తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమే’ అనేది ఒక అనువాద గ్రంథం. మహారాష్ట్ర, చంద్రాపూర్‌కు చెందిన డా.కె జమునాదాస్ 1991లో ‘తిరుపతి బాలాజీ వాజ్ బుద్దిస్ట్ శ్రయిన్’ అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాశారు. వృత్తి రీత్యా జమునాదాస్ ప్రముఖ శస్త్రవైద్యులు. చరిత్ర పరిశోధన ఆయన ఇష్ట వ్యాపకం. ఎఎన్ నాగేశ్వరరావు తెలుగులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. గత 34 సంవత్సరాలుగా మూల గ్రంథం ఇంగ్లిష్‌లో ముద్రణలు పొందుతోంది. చరిత్రకారుల, ఆలోచనాపరుల మధ్య దీనిపై చర్చ జరుగుతోంది. ఎవరూ రచయితను తప్పు పట్టలేదు. ఆయనపై దాడికి దిగలేదు. తమ మనోభావాలను దెబ్బతీస్తున్నాడని ఎవరూ ఆయనపై కోర్టుకు వెళ్ళలేదు. ఎందుకంటే అదొక చారిత్రిక పరిశోధనకు చెందిన పుస్తకం. పుస్తకం పేరు, ముఖచిత్రం చూసి దాడికి దిగడం మూఢత్వం, మూర్ఖత్వం.

గతంలో మన వద్ద రచయితలను అడ్డుకొని, వ్యక్తిగతంగా వారిని నిలదీసిన, వారిపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి కానీ అమ్మేవారిని ఎన్నడూ ప్రశ్నించలేదు. పుస్తకం కన్నా స్టాల్ యజమానియే లక్ష్యంగా జరిగిన సంఘటనగా దీన్ని భావించాలి. వారి ప్రశ్నలకు తగిన రీతిలో సమాధానం చెప్పిన వేణుగోపాల్‌కు రచయితలు, పాఠకులు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇది ఆవశ్యకం.

ఇన్నేళ్ల బుక్ ఫెయిర్ నిర్వహణలో ఈ సంఘటన ఒక అపశ్రుతిగానే భావించాలి. ఫలానా పుస్తకాలే అమ్మాలి అనే నిబంధలేమి బుక్ ఫెయిర్ పెట్టలేదు. ఇక్కడ పుస్తకమే ప్రధానం. అయితే ఈ దాడి బుక్ ఫెయిర్ ఆవరణలో జరిగింది. బుక్ సెల్లర్స్ రక్షణ బాధ్యతను బుక్ ఫెయిర్ చేపట్టాలి. దాడిని ఖండిస్తూ అమ్మకందారులకు మనోధైర్యాన్ని కలిగించవలసిన అవసరం ఉన్నది. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసుల తోడ్పాటు తీసుకోవాలి. ఒక స్టాల్ పోలీస్ పాయింట్‌కు కేటాయించి హెల్ప్ లైన్ నెంబర్ తెలియజేయాలి.

వ్యాపార సమయాల్లో పోలీస్ పహారా ఉండేలా చూడాలి. స్టాళ్ల వద్ద బయటి వ్యక్తులు ఏదైనా గొడవకు దిగితే తక్షణం నిర్వాహకులు అక్కడికి వచ్చేలా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఒక బృందం స్టాళ్ల సౌకర్యాలు, సదుపాయాల గురించి పర్యవేక్షించాలి. స్టాళ్లలో పుస్తకాలు తప్ప ఆవు పేడ పిడకలు లాంటివి అమ్మకుండా జాగ్రత్తపడాలి. పుస్తకాల అమ్మకాల కోసం కాకుండా స్టాళ్లు ఏదైనా ప్రచారం కోసం వాడకుండా పరిశీలించాలి. ఏ పుస్తకం కూడా బుక్ ఫెయిర్‌లోకి రావడానికి జంకగూడదు. రచనకు ప్రతిరచన, విమర్శయే జవాబు కావాలి. పుస్తకాల పూదోట ఏటేటా విరబూయాలి.

బి.నర్సన్ 94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News