Tuesday, January 7, 2025

రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వమిది:కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతల్లో మార్పు వచ్చింది తప్ప, తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం కాదు, ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదని, మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వమని, రైతు భరోసాలో కోతలు పెట్టే కుట్రలు చేస్తోందని విమర్శించారు.

రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎంతమంది ఉన్నదీ ప్రభుత్వం దగ్గర డేటా ఉందని, దద్దమ్మ ప్రభుత్వం కాకపోతే రైతుల నుండి దరఖాస్తులు ఎందుకు తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనేక హామీలు గుప్పించి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ది ప్రజాప్రభుత్వం కాదని, ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని అన్నారు.

ఫసల్ భీమా ప్రస్తావనే లేదు
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫసల్ బీమా ప్రస్తావనే లేదని, రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, రైతులకు సంకెళ్లు వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు బీఆర్‌ఎస్ రైతులకు సంకెళ్లు వేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అండగా ఉందని, నవంబర్ 30న నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారని అన్నారు. ఆ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్ లలో చేరలేదని,

ఇంకా నాలుగు సంవత్సరాలైనా రుణమాఫీ కాదని ఆయన సెటైర్లు వేశారు. కనీస మద్దతు ధర కొన్ని పంటల మీద 80 శాతం మోడీ ప్రభుత్వం పెంచిందని, కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నా ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇది నేరపూరిత చర్యగా కిషన్ రెడ్డి అభివర్ణించారు. ప్రైవేట్ రైస్ మిల్లర్‌లతో ఒప్పందం కుదుర్చుకుని రైతులకు అన్యాయం చేస్తుందని, రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి అధికారుల మీద అజమాయిషీ లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఎరువుల సబ్సిడీకి కేంద్రం రూ.33 వేల కోట్ల వ్యయం
తెలంగాణలో ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. ఎరువుల ధరలు పెరిగినా, కేంద్రం ఏనాడూ రైతులపై భారం వేయలేదని అన్నారు. పెరిగిన భారమంతా కేంద్రమే భరిస్తోందని తెలిపారు. కేంద్రం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. బీజేపీ హయాంలోనే ఎరువుల కొరత లేని పరిస్థితులు చూస్తున్నామని వివరించారు. కానీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతోందని విమర్శించారు. రైతులు పండించే పంట మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తోందని అన్నారు. కేజీ బియ్యాన్ని రూ.40కి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యుత్ కోతలు లేని పరిస్థితి తీసుకొచ్చిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News