Tuesday, January 7, 2025

కెటిఆర్‌కు ఎసిబి నోటీసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా ఈ రేస్ కారు రేసింగ్ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీ ఉదయం పది గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఎసిబి అధికారులు పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కారు రేసింగ్ కేసులో ఎసిబి ఇప్పటికే కెటిఆర్‌ను ఎ1 నిందితుడిగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే ఇదే కేసులో మాజీ మంత్రి కెటిఆర్‌కు ఇడి అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే 7వ తేదీన ఇడి అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉన్న సమయంలో ఎసిబి అధికారులు ఒకరోజు ముందు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడం చర్చనీయాంశమైంది.

ఎసిబి దర్యాప్తు ముమ్మరం
ఫార్మూలా ఈ రేస్ కేసులో దర్యాప్తును ఎసిబి ముమ్మరం చేసింది. తెలంగాణ మున్సిపల్ శాఖ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఈవో)ల మధ్య జరిగిన ఒప్పందం, అందులో చోటుచేసుకున్న ఉల్లంఘనలపై అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలోనే కేసు ఫిర్యాదుదారు ఎంఏయూడీ(పురపాలక శాఖ) ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నుంచి పలు విడతలుగా ఎసిబి సమాచారం సేకరించింది. ఇటీవల దానకిశోర్ నుంచి సుమారు ఏడు గంటల పాటు విచారించిన ఎసిబి పలు వివరాలను తీసుకుంది. వాటి ఆధారంగా దర్యాప్తును ముందుకు తీసుకెళ్లే పనిలో ఉంది. ఈ క్రమంలో కెటిఆర్‌కు నోటీసులు జారీ చేసింది.
ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఎంఏయూడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒప్పందంలో చోటు చేసుకున్న పలు కీలక ఉల్లంఘనలను ఎసిబి ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. వీటి కేంద్రంగా నిందితులను విచారించే అవకాశం కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం…హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్‌ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి,

లండన్ ఎఫ్‌ఈవోల మధ్య 2022 జనవరిలోనే ఒప్పందం కుదిరిందని, సంబంధిత దస్త్రం ఎంఏయూడీలో ఇప్పుడు అందుబాటులో లేదని గుర్తించినట్లు సమాచారం. అదే ఏడాది జులై 11న జారీ చేసిన జీవోలో మాత్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్ గురించి ప్రస్తావన ఉన్నట్లు వెల్లడైంది. రేసు నిర్వహణకు సంబంధించి అధికారిక ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే ఆ జీవో ఆధారంగా మున్సిపల్ శాఖ అప్పటి మంత్రి కెటిఆర్ అధ్యక్షతన నాటి ప్రభుత్వం మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తేలింది. 2022 అక్టోబర్ 25న హైదరాబాద్‌లో 9,10,11,12 సీజన్‌లలో ఫార్ములా ఈ రేస్‌లను నిర్వహించేందుకు ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో, ఏస్ నెక్ట్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల మధ్య త్రైపాక్షిక (మొదటి) ఒప్పందం కుదిరింది. దీనిని కుదుర్చుకునేటప్పుడు, సీజన్9 కోసం నిధులను ఖర్చు చేయడానికి అర్వింద్‌కుమార్ ప్రభుత్వంలోని కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం తీసుకోలేదని, ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తించినట్లు సమాచారం.

ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో వరుసగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి విదితమే. ఎసిబి కేసు ఆధారంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఇడి కూడా రంగంలోకి దిగింది. ఎసిబి ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్ మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మాజీ మంత్రి కెటిఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఇందులో భాగంగానే విచారణ కోసం ఇడి కూడా నోటీసులను జారీ చేసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల మళ్లింపుపై విచారణ జరుపుతున్న ఇడి జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలని కెటిఆర్‌కు నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా ఈ కేసులో ఎ2గా ఉన్న సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండిఎ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్‌ఎన్‌రెడ్డి(ఎ3)లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. బిఎల్‌ఎన్ రెడ్డి జనవరి 2వ తేదీన హాజరు కావాల్సి ఉన్నప్పటికీ గైర్హాజరయ్యారు.

ఇక ఈ కేసులో ఉన్న ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్ కూడా తనకు మరింత సమయం గడువు కావాలని కోరారు. దాంతో వారిద్దరి విచారణను తాత్కాలికంగా వాయిదా వేసి కొత్త తేదీలలో ఇడి అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8,9 తేదీల్లో వీరిని ఇడి విచారించనుంది.హెచ్‌ఎండీఏ బోర్డు అకౌంట్‌‌‌‌ నుంచి బ్రిటన్‌లోని అకౌంట్స్‌కు ఎలాంటి ట్యాక్సుప చెల్లించకుండానే రూ.45.71 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఇన్‌కం ట్యాక్స్ ఆడిట్‌లో వెలుగులోకి వచ్చింది. దీంతో హెచ్‌‌‌‌‌ఎండీఏ బోర్డుకు ఐటి నోటీసులు ఇచ్చింది. ఇందుకు గానూ హెచ్‌‌‌‌‌ఎండీఏ నిధుల నుంచే రూ. 8 కోట్ల 6 లక్షల 75 వేల 404 చెల్లించాల్సి వచ్చింది. దీంతో పాటు ఇన్‌ఇంటర్‌‌‌ే్స్టట్ ఛాంపియన్షిప్ క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు కోసం ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోరట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు మరో రూ. 1,10,51,014 హెచ్‌‌‌‌‌ఎండీఏ చెల్లించింది. ఇలా మొత్తంగా రూ. 54,88,87,043 హెచ్‌‌‌‌‌ఎండీఏ నిధుల నుంచి చెల్లింపులు జరిగినట్టుగా ఎసిబి ఆరోపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News