Tuesday, January 7, 2025

తెలంగాణను స్పోర్ట్ హబ్ గా మారుస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన మంత్రి శ్రీధర్ బాబును సచివాలయంలో కలుసుకుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఒక క్రీడాకారుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్ హబ్ గా మార్చాలని పట్టుదలతో ఉన్నారని తెలిపారు. దక్షిణ కొరియాలోని ఒక చిన్న స్పోర్ట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో 37 పతకాలు సాధించారని, ఈ స్ఫూర్తితోనే తెలంగాణలోనూ స్పోర్ట్ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నట్లు మంత్రి తెలిపారు. అకడమిక్స్‌తో క్రీడలను మిళితం చేస్తూ విద్యార్థి వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతూ.. ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్ పాలసీకి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు.

ఈ ప్రక్రియలో విద్యావేత్తలు, ప్రముఖ క్రీడాకారులను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని మంత్రి వివరించారు. తెలంగాణలో ప్రతిభకు కొరత లేదు. క్రీడల్లో సత్తా చాటుతూ గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో స్పోరట్స్ యూనివర్సిటీ అనుబంధ కేంద్రాలు, స్పోర్ట్ హబ్స్ ఏర్పాటు చేస్తామని. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ అకడమిక్, స్పోర్ట్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వివరించారు. పేదలు, ధనికుల మధ్య తారతమ్యాలు లేకుండా సమ్మిళిత వృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. కొత్త పాఠశాలలకు అనుమతులిచ్చే ప్రక్రియలో మార్పులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. పాఠశాల ఆవరణలో క్రీడామైదానం ఉంటేనే ఇకపై అనుమతులు ఇస్తామన్నారు. అందరూ కలిస్తేనే క్రీడలను అభివృద్ధి చేయగలమని, ప్రభుత్వం తరఫున క్రీడాకారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

ఒలంపిక్ సంఘం, ఇతర సంఘాలు, అకాడమీలను కలుపుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సహకరిస్తేనే క్రీడలు అభివృద్ధి చెందుతాయని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. స్పోర్ట్ యూనివర్సిటీ, స్పోర్ట్ పాలసీ తీసుకురావడం నిజంగా గొప్ప ప్రయత్నం అని అన్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(అండర్ – 19 ఇయర్స్) ను గచ్చిబౌలిలోని గోపిచంద్ అకాడమీలో నిర్వహిస్తున్నట్లుగా వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News