Tuesday, January 7, 2025

జలసంకల్పం

- Advertisement -
- Advertisement -

టార్గెట్ 2050 అప్పటికి హైదరాబాద్‌లో పెరిగే
జనాభాకు సరిపడా నీళ్లు మళ్లించే ప్రణాళికలు
రూపొందించాలి 20టిఎంసిల నీరు తరలించేలా
పథకాలు రూపొందించాలి మల్లన్న సాగర్,
కొండపోచమ్మ నుంచి నీళ్లు తరలించాలని సూచన
మంజీర పైప్‌లైన్‌కు ప్రత్యామ్నాయంగా మరో
పైప్‌లైన్ నిర్మించాలని ప్రతిపాదన జలమండలి
అధికారుల భేటీలో సిఎం రేవంత్‌రెడ్డి బోర్డు
అధ్యక్షుడి హోదాలో తొలిసారి సమావేశానికి హాజరు

మనతెలంగాణ/హైదరాబాద్:రాబోయే 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను అంచనా వేసుకొని, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడా మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభా అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని సిఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్‌ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని ఆయన అన్నారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం హైదరాబాద్ జల మండలి బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోర్డు సమావేశం కావడం ఇదే తొలిసారి. బోర్డు చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెచ్‌ఎండబ్ల్యుఎస్ ఎండి అశోక్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ఉన్న జనాభాకు సరిపడే తాగునీటిని సరఫరా చేస్తున్నామని, మొత్తం 9,800 కిలోమీటర్ల డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ద్వారా 13.79 లక్షల కనెక్షన్లకు నీటిని సరఫరా చేస్తున్నట్లు సిఎంకు అధికారులు నివేదించారు. మంజీరా, సింగూరు, గోదావరి, కృష్ణా నుంచి సిటీకి ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతోందని, గోదావరి ఫేజ్ 2 ద్వారా మరింత నీటిని తెచ్చుకొని ఉస్మాన్‌సాగర్ , హిమాయత్ సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ జరిగింది. గోదావరి ఫేజ్ 2 ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ నుంచి నీటిని తీసుకోవాలా, కొండపోచమ్మ సాగర్‌ను నీటి వనరుగా ఎంచుకోవాలా అన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికతో పాటు నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే తాగునీటి సరఫరా ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రతిపాదించిన 15 టిఎంసిలకు బదులు, సిటీ అవసరాల దృష్ట్యా 20 టిఎంసిల నీటిని తెచ్చుకునేలా మార్పులకు ఆమోదం తెలిపారు.

రూ.5,500 కోట్ల కరెంట్ బిల్లుల పెండింగ్
ఈ సందర్భంగా హైదరాబాద్ జలమండలి ఆదాయ వ్యయాల నివేదికను ఎండి అశోక్ రెడ్డి పవర్ పాయిం ట్ ప్రజేంటేషన్ ద్వారా సిఎంకు వివరించారు. జలమండలికి వచ్చే ఆదాయం ఉద్యోగుల జీతభత్యాలకు, తాగునీటి సరఫరా నిర్వహణ ఖర్చులకు సరిపోతుందని ఆయన వివరించారు. వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల నుంచి దాదాపు రూ. 4,300 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నాయని, కరెంటు బిల్లులకు జలమండలి దాదాపు రూ.5,500 కోట్లు బాకీ పడిందని, రూ.1,847 కోట్లు గతంలో తీసుకున్న అప్పులున్నాయని, దాదాపు రూ. 8,800 కోట్ల రెవెన్యూ లోటు ఉందని ఎండి వివరించారు. జలమండలి తమ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, అందుకు అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేయాలని సిఎం సూచించారు. ఇప్పటికే 20 వేల లీటర్ల నీటిని సిటీలో ఉచితంగా సరఫరా చేస్తున్నందున, ఇతర కనెక్షన్ల నుంచి రావాల్సిన నల్లా బిల్లు బకాయిలు క్రమం తప్పకుండా వసూలయ్యేలా చూడాలన్నారు. జలమండలి కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పాత పైప్ లైను వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా కొత్త ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News