Tuesday, January 7, 2025

సమ్మెబాటలోనే సమగ్ర శిక్ష ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

ఇరవయ్యవ శతాబ్దంలో వచ్చిన ఎన్నో పోరాటాల ఫలితంగా బానిసత్వం, వెట్టిచాకిరి రద్దు అయ్యాయి. తరువాత కాలంలో ఎన్నో ఉద్యమాల ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాలు అనేక హక్కులు సాధించుకున్నారు.1991లో ఆర్థిక సంస్కరణలో భాగంగా మన దేశంలో ప్రారంభమైన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికవర్గాల హక్కులను కాలరస్తూ, కార్పొరేట్ శక్తులకు రెడ్‌కార్పెట్ వేస్తూ, కార్మిక చట్టాలను సరళీకరిస్తూ, ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను రద్దు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్వహించే అనేక పథకాల్లో, స్కీములలో కాంట్రాక్టు విధానం రాజ్యమేలుతుంది. ఆశ, అంగన్‌వాడి, సమగ్రశిక్ష, కెజిబివి, యుఆర్‌ఎస్ ఇలా అనేక విభాగాల్లో ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతి ద్వారానే నియమిస్తున్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య, జీవిత బీమా సౌకర్యం, రిటైర్మెంట్ ప్రయోజనాలు తదితర సౌకర్యాలు వీరికి ఉండవు.

సర్వీస్‌లో మరణిస్తే ఉద్యోగి కుటుంబానికి భద్రతాఉండదు. ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు ప్రారంభిస్తున్న ప్రభుత్వాలు, ఆ పథకాలు అమలు చేసే ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ఆదర్శవంతంగా ఉండాల్సిన ప్రభుత్వాలే దశాబ్దాల కాలంగా కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను దోపిడీ చేస్తుంటే వారికి న్యాయం చేసేది ఎవరు? సమగ్రశిక్ష అభియాన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య పథకం. దీని కింద గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో సుమారు 19,350 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మండల వనరుల కేంద్రంలో సిసిఒలు, ఎమ్‌ఐఎస్ కోఆర్డినేటర్లు, మెసేంజర్లు భవిత కేంద్రాలలో ప్రత్యేక ఉపాధ్యాయులు (ఐఇఆర్‌పిలు), స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సిఆర్‌పిలు, పాఠశాల స్థాయిలో పిటిఐఎస్‌లు. కెజిబివిలో స్పెషల్ ఆఫీసర్లు, పిజిసి ఆర్‌టిలు, సిఆర్‌టిలు, పిఇటిలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎఎన్‌ఎంలు, డిపిఒ కార్యాలయంలో ఎపిఒలు, సిస్టం ఎనాలసిస్టులు, డిపిఒ ఆపరేటర్లు, అటెండర్లు తదితరులు సమగ్ర శిక్షలో కాంట్రాక్టు విధానంపై పని చేస్తున్నారు. వారికి కనీస వేతనాలు లేక, భీమా సౌకర్యం లేక రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేక, ఆధునిక బానిసత్వాన్ని, వెట్టిచాకిరి అనుభవిస్తున్నారు. ఇప్పటికే వివిధ పద్ధతుల్లో వారెన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా అవి నేటికీ నీటిపై రాతలుగానే మిగిలిపోయాయి.

కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం నెపం నెట్టుతూ సమగ్రశిక్ష ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తున్నాయి. సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, విద్యాశాఖలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయాలని, ప్రతి ఉద్యోగి జీవిత బీమా, ఆరోగ్య బీమా కల్పించి 20 లక్షల ఎక్స్‌గ్రేషియో కల్పించాలని, సిఎం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, విధి నిర్వహనలో మరణించిన ఉద్యోగులకు 20 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని, డిఎస్‌సి నియామకాల్లో 30% వెయిటేజ్ ఇవ్వాలని, పదవీ విరమణ బెనిఫిట్స్ కల్పించాలని గత 21 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం విచారకరం. మరోపక్క కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయొద్దని హైకోర్టు చెప్పిందని జిఒ నెంబర్ 16 గురించి కొందరు మాట్లాడుతున్నారు. అది కేవలం కాంట్రా క్టు జెఎల్ రెగ్యులరైజేషన్ విషయంలో హైకోర్టు చెప్పిన్న తీర్పు. వారు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా నియామకం కాలేరు, రోస్టర్ పాయింట్లు పాటించలేరు, రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో వారు నియమించబడ్డారు.

కాబట్టి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో హైకోర్టు ఆ తీర్పు ఇచ్చి ఉండవచ్చు. కానీ సమగ్రశిక్ష ఉద్యోగులు రాత పరీక్ష ద్వారా, రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం నియామకం అయ్యారు. అంతకు ముందు వారి స్థానాల్లో రెగ్యులర్ ఉద్యోగులు ఎవ్వరూ లేరు, కాబట్టి నిరుద్యోగులకు నష్టం లేదు. సాంకేతికంగా హైకోర్టు తీర్పు సమగ్ర శిక్ష ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణకు అడ్డంకి కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మోడల్ స్కూల్ వ్యవస్థను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని నిర్వహిస్తున్నట్లు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగ, ఉపాధ్యాయులను విద్యా శాఖలో విలీనం చేసి వారి సేవలు క్రమబద్ధీకరణ చేయవచ్చు. లేక రాష్ట్రంలో ఉన్న వివిధ గురుకుల సొసైటీలవలె సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను ఒక ప్రత్యేకమైన సొసైటీగా రూపొందించి నిర్వహించడం ద్వారా వారి సేవలు క్రమబద్ధీకరణ చేయవచ్చు. ఆర్థిక సంస్కరణల అభివృద్ధి ఫలాలు అన్నివర్గాల ప్రజలకు అందాలే కాని కొన్ని వర్గాల ప్రజలను కట్టుబానిసలుగా, వెట్టి చాకిరిలోకి నెట్టివేయరాదు.

జుర్రు నారాయణ యాదవ్
9494019270

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News