Tuesday, January 7, 2025

వెన్నెముకకు గాయమైతే ఎన్నో సమస్యలు

- Advertisement -
- Advertisement -

వెన్నెముక పూర్తిగా తెగిపోయినా, పక్షవాతానికి గురైనా తిరిగి నడవగలిగేలా చేసే అత్యంత ఆధునిక వైద్య చికిత్సలు కూడా ఉన్నాయి. 1997 ప్రాంతంలో మోటార్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇటలీ యువకుడు మైఖేల్ రొక్కాటి తన వెన్నుపూస పూర్తిగా దెబ్బతినడంతో పక్షవాతానికి గురయ్యాడు. కాళ్లలో స్పర్శ కోల్పోయాడు. స్విట్జర్లాండ్‌లో దీనికి శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు ఆయన వెన్నుముకలో ఎలక్ట్రికల్ ఇంప్లాంట్ అమర్చడంతో మెదడు నుంచి ఆగిపోయిన సంకేతాలు తిరిగి పని చేయడం ప్రారంభించాయి. కాళ్ల వరకు సంకేతాలు అందగలిగాయి. దీంతో తిరిగి కోలుకుని నడవగలిగాడు. మైఖేల్ ఇంతవేగంగా కోలుకోవడాన్ని చూసి ఆయనకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయారు.

వెన్నుపాము అనేది నాడీ వ్యవస్థలోని నరాలు, కీళ్లు, కండరాలు, స్నాయు వు, అస్థిపంజరాలతో కూడిన కేంద్ర నాడీ మండలానికి చెందిన సంక్లిష్టమైన అనుసంధాన వ్యవస్థ. సన్నగా, పొడవుగా, గొట్టం మాదిరిగా ఉండి మెదడు నుంచి సందేశాలను శరీరమంతటికీ పంపిస్తుంది. అలాగే బాహ్యశరీరం నుంచి సందేశాలను మెదడుకు పంపుతుంది. సాధారణంగా మనకు వెన్నునొప్పి వస్తుంటుంది. వెన్నుపాము నుంచి ఉద్భవించిన నరాలు కాళ్లలోకి, మోచేతుల్లోకి ప్రయాణించి శరీరంలోని వివిధ విభాగాలకు నొప్పిని వ్యాపింప చేస్తుంటాయి. జీవితంలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది పెద్దవాళ్లకి, అలాగే ప్రతి పది మంది శ్రామికుల్లో ఐదు మంది, ప్రతి సంవత్సరమూ వెన్నునొప్పితో బాధపడుతుంటారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ నొప్పి తీవ్రమైనప్పుడు వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది.

అలాగే వెన్నుకు గాయమైనా శరీర వ్యవస్థకు, మెదడుకు ఇబ్బంది కలుగుతుంది. వెన్నుముక గాయం ఒక్కోసారి పక్షవాతానికి దారి తీస్తుంది. కాళ్లూ చేతులు పక్షవాతానికి గురైతే మనిషిలో చలనం క్షీణిస్తుంది. మల, మూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. లైంగిక చర్యలో మార్పు వస్తుంది. వెన్నుముక గాయమైన వారిలో మానసిక, ఉద్రేక, సామాజిక రుగ్మతలు కూడా వస్తుంటాయి. బ్రిటన్‌లో దాదాపు 50,000 మంది వెన్నుముక గాయంతో బాధపడుతున్నారు. ఏటా మరో 2500 మంది ఈ జాబితాలో చేరుతున్నారు. వెన్నుముక గాయాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు, హింసాత్మక దాడులు, క్రీడలు, ఒక ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడడం తదితర సంఘటనల వల్ల సంభవిస్తుంటాయి. నేషనల్ హెల్త్ సర్వీసెస్ మార్గదర్శకాల ప్రకారం ఈ రోగులకు తరచుగా మానసిక ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ఈ రోగులను గుర్తించిన తరువాత రెండేళ్ల వరకు ప్రతి ఆరుమాసాలకు మానసిక ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.

కానీ అలా జరగడం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. శారీరక ఆరోగ్యం గురించే ఈ పరీక్షలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ రెండేళ్ల కాలం వీరికి ఏమాత్రం సరిపోదని, జీవితాంతం పరీక్షలు చేయించాలని సీనియర్ వైద్యులు సూచిస్తున్నారు. వీల్ ఛైర్లకే పరిమితమైన ఈ రోగుల్లో చాలా మందికి మానసిక ఆరోగ్యాన్ని పరీక్షించడానికి స్పెషలిస్టు సైకోథెరపిస్టు అవసరమని వైద్య నిపుణులు కొత్త మార్గదర్శకాల్లో వివరిస్తున్నారు. వెన్నుముక గాయానికి గురైన వారిలో పక్షవాతం రెండు రకాలుగా ఉంటుంది. టెట్రాప్లెజియా, పారాప్లెజియా అనే రెండు విధాలైన పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. టెట్రాప్లెజియా అంటే క్వాడ్రిప్లెజియా అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇందులో భుజాలు, చేతులు, కడుపు, కాళ్లు, కటి అవయవాలు పక్షవాతానికి గురవుతుంటాయి. పారాప్లెజియాలో కడుపులోని అన్ని అవయవాలు, కాళ్లు, కటి అవయవాలు పక్షవాతానికి గురవుతుంటాయి.

అయితే చేతులు మాత్రం పక్షవాతానికి గురికావు. శరీరంలో నరాల స్థాయిని, గాయం పూర్తిగా మానడాన్ని వైద్యులు తరచుగా పరీక్షిస్తుంటారు. వెన్నుముక గాయం వల్ల చలనం కోల్పోతుంటారు. స్పర్శ జ్ఞానంలో మార్పు లేదా కోల్పోవడం జరుగుతుంది. వేడి, చల్లదనం, స్పర్శ కోల్పోవచ్చు. మల, మూత్ర విసర్జన నియంత్రణ కోల్పోవచ్చు. అసంకల్పిత చర్యలు, సంకోచాలు పెరుగుతాయి. వెన్నుపాములోని నరాల పోగులు దెబ్బతినడం వల్ల బాధ, ఏదో కుట్టుతున్నట్టు అనిపిస్తుంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. దగ్గు లేదా ఊపిరితిత్తుల్లో కఫం చేరినట్టు అవుతుంది. సాధారణంగా వెన్నుముకకు మామూలు గాయం అయితే ఒకంతట తెలియదు. తీవ్రస్థాయిలో ఉంటేనే తెలుస్తుంది. వెన్నుముక గాయపడడానికి, వైద్య చికిత్స అందించడానికి మధ్య ఉన్న సమయం చాలా కీలకమైనది. గాయాల స్థాయిని తెలుసుకుంటే సాధ్యమైనంతవరకు కోలుకునే పరిస్థితిని గుర్తించవచ్చు. గాయపడిన వ్యక్తిని కదిలించరాదు.

దానివల్ల శాశ్వత పక్షవాతం, ఇతర తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. మెడకు రెండు వైపులా భారీ టవల్స్ ఉంచాలి. అత్యవసర వైద్యం అందేవరకు తల, మెడ, కదపకుండా ఉంచాలి. వెన్ను నొప్పితో పాటు మూడు రకాల క్యాన్సర్ల ఇతర లక్షణాలు కనిపించవచ్చు. వెన్నుముక క్యాన్సర్ సంకేతాలలో తిమ్మిరి, బలహీనత, చేతులు, కాళ్లలోసమన్వయ లోపం, పక్షవాతం కూడా ఉంటాయి. మూత్రాశయ క్యాన్సర్ ఉంటే మూత్ర విసర్జన సమయంలో రక్తం, నొప్పి, ఎక్కువగా ఉంటాయి. వెన్నుపాము రుగ్మతలు, క్షీణత నిర్ధారించడానికి వైద్య పరీక్షలున్నాయి. వెన్నుముక పగుళ్లు, కణుతులు తనిఖీ చేయడానికి ఎక్స్ రే, ఎంఆర్‌ఐ, సిటిస్కాన్ పరీక్షల్లో వెన్నుముకపై ఉన్న ఒత్తిడి తెలుస్తుంది. మైలోగ్రఫీ వల్ల వెన్నుముక స్థానం, అసాధారణతల ఉనికిని గుర్తించవచ్చు. కచ్చితమైన నరాల మూలాన్ని గుర్తించడానికి ఎలక్ట్రోమియోగ్రామ్ పరీక్షలున్నాయి. వెన్నునొప్పి తీవ్రతను బట్టి నివారించే స్పైరల్ ఫ్యూజన్, ఫోరమినోటమీ, డిస్సెక్టమీ, డిస్క్ మార్పిడి, ఇంటర్ లామినార్ ఇంప్లాంట్, వంటి అనేక రకాల సర్జరీలు అమలులో ఉన్నాయి.

ఎలక్ట్రికల్ ఇంప్లాంట్ తో అద్భుత ఫలితాలు

వెన్నెముక పూర్తిగా తెగిపోయినా, పక్షవాతానికి గురైనా తిరిగి నడవగలిగేలా చేసే అత్యంత ఆధునిక వైద్య చికిత్సలు కూడా ఉన్నాయి. 1997 ప్రాంతంలో మోటార్ బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇటలీ యువకుడు మైఖేల్ రొక్కాటి తన వెన్నుపూస పూర్తిగా దెబ్బతినడంతో పక్షవాతానికి గురయ్యాడు. కాళ్లలో స్పర్శ కోల్పోయాడు. స్విట్జర్లాండ్‌లో దీనికి శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు ఆయన వెన్నుముకలో ఎలక్ట్రికల్ ఇంప్లాంట్ అమర్చడంతో మెదడు నుంచి ఆగిపోయిన సంకేతాలు తిరిగి పని చేయడం ప్రారంభించాయి. కాళ్ల వరకు సంకేతాలు అందగలిగాయి. దీంతో తిరిగి కోలుకుని నడవగలిగాడు. మైఖేల్ ఇంతవేగంగా కోలుకోవడాన్ని చూసి ఆయనకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్లే ఆశ్చర్యపోయారు.

ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందికి ఎలక్ట్రికల్ ఇంప్లాంట్‌ను డాక్టర్లు అమర్చగలిగారు. ప్రస్తుతం ఈ ఎలక్ట్రికల్ ఇంప్లాంట్ ద్వారా నడవగలిగే వరకు పురోగతి కనిపిస్తోంది. కానీ వెన్నెముకని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి కావలసిన వైద్యం ఇంకా అభివృద్ధి చెందవలసి ఉంది. అందుకు స్టెమ్‌సెల్ థెరపీ (మూలకణాలతో చికిత్స) పద్ధతులు సాయపడవచ్చు. కానీ ఇంకా అవి పరిశోధనా క్రమంలోనే ఉన్నాయి. జీవితాన్ని మెరుగుపర్చడానికి ఇదొక సానుకూల ముందడుగే అయినప్పటికీ, ఈ టెక్నాలజీని రోజువారీ జీవితంలో ఉపయోగించడం తేలికైన విషయం కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డా. బి. రామకృష్ణ 9959932323

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News