Wednesday, January 8, 2025

ట్రంప్‌కు శిక్ష తప్పదు

- Advertisement -
- Advertisement -

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే,హష్ మనీ కేసులో ట్రంప్‌ను న్యూయార్క్ కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది. ఈ కేసులో ట్రంప్‌కు ఈ నెల 10న శిక్ష ఖరారు చేస్తామని న్యూయార్క్ జడ్జి జస్టిస్ హవాన్ మర్చన్ తెలిపారు. దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్ష విధించడం తప్పదని చెబుతూనే ఆయన జైలుకు వెళ్లే అవసరం మాత్రం లేదని జస్టిస్ హవాన్ అన్నారు. ఎటువంటి జరిమానా చెల్లించవలసిన అవసరం కూడా లేదని, ట్రంప్‌కు అన్‌కండిషనల్ డిశ్చార్జ్ అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. హష్ మనీ కేసులో 10న తుది తీర్పు వెలువరిస్తామని, ఆ రోజు ట్రంప్ వ్యక్తిగతంగానైనా లేక వర్చువల్‌గానైనా కోర్టుకు హాజరు కావచ్చునని ఆయన సూచించారు. ఒక వేశ ట్రంప్‌కు శిక్ష ఖరారైతే, దోషిగా తేలి శిక్ష ఖరారైన తొలి అధ్యక్షుడుగా ట్రంప్ నిలుస్తారు.

హష్ మనీ కేసులో ట్రంప్‌ను తప్పించేందుకు ఆయన న్యాయవాదులు విశ్వప్రయత్నం చేశారు. ట్రంప్‌పై ఆరోపణలు కొట్టివేయాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్‌కు ఈ కేసు నుంచి రక్షణ లభిస్తుందని వారు వాదించారు. కానీ, ట్రంప్ లాయర్ల వాదనలను న్యూయార్క్ జ్యూరీ తోసిపుచ్చింది. ప్రెసిడెంట్ హోదాలో తీసుకున్న నిర్ణయాలకుసంబంధించి మాత్రమే రక్షణ ఉంటుందని, వ్యక్తిగతమైన కేసులకు అటువంటి మినహాయింపులు ఏవీ లేవని జ్యూరీ స్పష్టం చేసింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషిగా నిర్ధారణ కావడంతో శిక్ష విధించడం తప్పదని జ్యూరీ తెలిపింది. ఈ మేరకు జస్టిస్ హవాన్ మర్చన్ 18 పేజీల తుది తీర్పును 10న వెలువరిస్తామని తెలియజేశారు,

హష్ మనీ కేసు
డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో గతంలో సన్నిహితంగా గడిపారని, అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పకుండా డబ్బు చెల్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును హష్ మనీ పేరుతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం సేకరించిన విరాళాల నుంచి స్టార్మీ డేనియల్స్‌కు సొమ్ము చెల్లించారని, ఈ విషయం బయటపడకుండా రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ అభియోగాలు ఎదుర్కొన్నారు. బిజినెస్ వ్యవహారాలు సంబంధించిన రికార్డుల్లో అవకతవకలకు పాల్పడ్డారని, అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారని ట్రంప్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. విచారణలో అభియోగాలు అన్నీ నిజమేనని ప్రాసిక్యూషన్ నిరూపించింది. ప్రాసిక్యూషన్ స్టార్మీ డేనియల్స్‌ను కోర్టులో హాజరుపరచి సాక్షం ఇప్పించింది. ప్రాసిక్యూషన్ వాదనలతోఏకీభవించిన న్యూయార్క్ జ్యూరీ ట్రంప్‌ను దోషిగా నిర్ధారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News