Wednesday, January 8, 2025

రాష్ట్రంపై మంచు దుప్పటి

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా చలి ప్రభావం పెరిగిపోయింది. పలు జిల్లాల్లో కనీస ఉష్ణోగ్రతలు పడిపోయి రాష్ట్రంపై మంచుదుప్పటి కప్పినట్లు ఉంది. రానున్న మూడు రోజుల్లో చలి ప్రభావం మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం ప్రకటించింది. సంక్రాంతి వరకు దాదాపు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అత్యల్ప స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలి ధాటికి అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా అటవీ, మైదాన, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావం తెలంగాణపై పడుతుండడంతో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువ నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోవడంతో పగలే చలి ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్రంలో శీతల గాలుల ప్రభావం ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆరు జిల్లాల్లో కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రత
ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రానున్న రెండు మూడు రోజుల్లో నమోదు అవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భునవగిరి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

మిగిలిన జిల్లాల్లో కనిష్టంగా 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొంది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. సంక్రాంతి పండుగ సమయానికి చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశముందని తెలిపారు. ఈశాన్య గాలులు రాష్ట్రంలో చురుకుగా వీస్తుండటం, తూర్పు గాలుల ప్రభావం కూడా ఉండటంతో చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా అధికంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈసారి ఉష్ణోగ్రతల నమోదులో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News