Wednesday, January 8, 2025

సోషల్ మీడియా వినియోగంపై కొత్త చట్టం తెస్తున్న కేంద్రం

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజల్లో ఒక భాగమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రయాణాలు, లావాదేవీలు, షాపింగ్‌లో ఏది కొనుగోలు చేయాలన్నా, కాలక్షేపం కోసం పిల్లల నుంచి పెద్దల వరకు సెల్‌ఫోన్ వాడుతూనే ఉన్నారు. అయితే, ఇటీవలి కాలంలో చిన్నారులు గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడుపుతున్నారని, దీని వల్ల వారిపై విపరీతమైన ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతే కాకుండా, వారి డేటా ఉల్లంఘనలపైనా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిన్నారులను ఇంటర్నెట్‌కు, అందులోను ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇటీవల కొన్ని దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలకు సన్నద్ధం అయింది. ఈ చర్యల్లో భాగంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025కు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఇందులో ప్రధానంగా 18 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్ తెరవడానికి తల్లిదండ్రుల సమ్మతిని కేంద్రం తప్పనిసరి చేసింది. ప్రజలు దీనిపై సూచనలు, అభ్యంతరాలు పంపాలని కేంద్రం కోరింది. వారు ‘మైగవ్.ఇన్’ వెబ్‌సైట్‌లో తమ అభ్యంతరాలు, సూచనలు పంపవచ్చు. ఫిబ్రవరి 18 తరువాత వాటిని కేంద్రం పరిశీలించనున్నది. వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ముసాయిదాలో కేంద్రం మార్పులు చేర్పులు చేసి చట్టాన్ని తీసుకురానున్నది. కేంద్ర ఎటక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం చిన్నారులు సోషల్ మీడియా ఖాతాలు తెరవాలంటే తల్లిదండ్రుల లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి. అది కచ్చితంగా ధ్రువీకృతమైందిగా ఉండాలని నిబంధనల్లో స్పష్టం చేశారు. సమాచార రక్షణకు సంబంధించి పిల్లల వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేసేందుకు కచ్చితంగా తల్లిదండ్రుల నుంచి అంగీకారం పొందాలని నిబంధనల్లో ఉంది.

దీని వల్ల సోషల్ మీడియాలను నిర్వహించే సంస్థలు చిన్నారుల వ్యక్తిగత డేటాను వాడుకోవాలన్నా, భద్రపరచుకోవాలనుకున్నా తల్లిదండ్రుల సమ్మతి పొందిన తరువాతే సాధ్యం అవుతుంది. ఈ ముసాయిదాలో వినియోగదారునికి అనుకూలంగా పలు కీలక అంశాలను కేంద్రం తీసుకువచ్చింది. డేటా సంరక్షణపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండేలా నిబంధనలు రూపొందించారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కంపెనీలు మరింత పారదర్శకంగా ఉండాలి. తమ వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలు ఎందుకుసేకరిస్తున్నాయి అని అడిగేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించారు. సేకరించిన తమ సమాచారాన్ని తొలగించవలసిందిగా వినియోగదారులు డిమాండ్ చేయవచ్చు. ఒకవేళ డేటా ఉల్లంఘనకు పాల్పడితే సదరు సంస్థలపై రూ. 250 కోట్ల వరకు జరిమానా విధించే ప్రతిపాదనను పొందుపరిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News