Wednesday, January 8, 2025

మహిళా పాలిటెక్నిక్ కళాశాల వాష్‌రూమ్‌లో కెమెరాలు

- Advertisement -
- Advertisement -

ఆగ్రహించిన విద్యార్ధినులు రక్షణ కల్పించాలంటూ
కళాశాల ఎదుట తల్లిదండ్రులతో కలిసి ధర్నా..
ఉద్రిక్తత పోలీసుల అదుపులో నిందితుడు
వరుస సంఘటనలతో విద్యార్థిలోకంలో కలవరం

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బాలికల బాత్రూమ్‌లో మొబైల్ కెమెరాల ఘటన కలకలం సృష్టించింది. విద్యార్థినులు తమకు రక్షణ కల్పించాలని, కళాశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. బాత్రూమ్‌లో మొబైల్ కెమెరాల విషయమై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కళాశాలలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిందితుడు నక్క సిద్దార్ధ అనే విద్యార్థి వాష్ రూమ్‌లో కెమెరా పెట్టినట్లు గుర్తించామని వన్ టౌన్ సిఐ అప్పయ్య తెలిపారు.

వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాగా, కళాశాలలో రోజురోజుకు దారుణాలు జరుగుతున్నాయని ఎబివిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో వరుసగా ఇలాంటి ఘటనలు బయటపడుతుండడంతో విద్యార్థినులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆకతాయిల్లో మాత్రం మార్పు రావడం లేదన్నారు. విద్యార్థినులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News