Wednesday, January 8, 2025

మన ఐటి రంగానికి పెనుసవాళ్లు

- Advertisement -
- Advertisement -

భారతీయ ఐటి కంపెనీలు, ఉద్యోగులు ప్రస్తుతం పెనుసవాళ్లను ఎదుర్కొంటున్నారు. రోజుకొకటి చొప్పున పుట్టుకొస్తున్న సరికొత్త టెక్నాలజీలు ఒకవైపు, త్వరలో అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు మరోవైపు భారతీయ ఐటి రంగంపై పెనుప్రభావం చూపిస్తాయన్న ఊహాగానాలు కలవరం కలిగిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రంగంలో భారతీయ యువతకు ఎదురులేదంటే అతిశయోక్తి కాదు. 54 లక్షల మంది భారతీయ యువతకు ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో భారతీయ ఐటి నిపుణులకు ఎంతో డిమాండ్ ఉంది.

అయితే కొంతకాలంగా ఈ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ప్రవేశిస్తున్న సరికొత్త టెక్నాలజీలు మన యువతకు సవాళ్లు విసురుతున్నాయి. గత మూడేళ్లుగా కృత్రిమ మేధ అనే పేరు విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. దీని పుణ్యమాని, ఒకప్పుడు మనిషి నుంచి సంకేతాలు అందుకుని పనిచేసిన రోబోలు ఇప్పుడు స్వీయ నిర్ణయాలతో పనిచేసే స్థాయికి చేరాయి. ఇందుగలదందు లేదని సందేహము వలదు అన్నట్లు కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. దీనివల్ల యువత భారీ స్థాయిలో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందనడంలో ఆశ్చర్యం లేదు. కృత్రిమ మేధకు తోడు డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ వంటి ప్రత్యేక తరహా నైపుణ్యాలు రాబోయే రోజుల్లో ఐటి రంగాన్ని ఏలబోతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఇందుకు తగినట్లుగానే ఐటి కంపెనీలు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ వంటి సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకున్న యువత కోసం అన్వేషిస్తున్నాయి. రాగల రోజుల్లో ఈ ప్రత్యేక రంగాల్లో కొన్ని లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐటి రంగంలో నిలదొక్కుకున్నవారు, తాజాగా డిగ్రీ చేతబట్టుకుని యూనివర్శిటీ క్యాంపస్ దాటి బయటకొచ్చిన యువత సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న యువతీయువకులు చాలినంతమంది లేకపోవడంతో ప్రస్తుతం ఐటి కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకే ఆయా రంగాల్లో శిక్షణనిచ్చి, ప్రోత్సహిస్తున్నాయి.

ఐటి రంగంలో సరికొత్త మార్పుల కారణంగా భారతీయ ఐటి నిపుణులకు ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు తోడు అమెరికాలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు సైతం మన ఐటి రంగాన్ని దెబ్బతీసేలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హెచ్1బి వీసాలపై అనేక ఆంక్షలు విధించారు. దీంతో ఐటి రంగం ఆటుపోట్లకు గురైంది. మరొకసారి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో భారతీయ ఐటి కంపెనీలు సహజంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈసారి ట్రంప్ హెచ్1బి వీసాలపై కాస్త మెత్తబడినట్లే కనిపిస్తోంది. అమెరికాకు ప్రతిభాపాటవాలు ఉన్న వ్యక్తులు కావాలని, హెచ్1బి వీసాలు వారికి ఆహ్వానం పలుకుతాయని ఆయన వ్యాఖ్యానించడం స్వాగతించదగినదే అయినా క్షణానికో విధంగా మారే ట్రంప్ మాటల తీరును సందేహించేవారే ఎక్కువ. పైపెచ్చు హెచ్1బి వీసాలపై రిపబ్లికన్ల వైఖరిని డెమోక్రాట్లు తీవ్రంగా తప్పుబడుతున్నారన్న సంగతి ఇక్కడ గమనార్హం. ఇదిలాఉంటే, ట్రంప్ మళ్లీ గెలవడంతో అగ్రరాజ్యంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మగా) ఉద్యమం ఊపందుకుంటోంది. వలస విధానాల వల్లే అమెరికన్లకు ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయంటూ విశ్వసించేవారి సంఖ్య అమెరికాలో రానురాను పెరుగుతోంది. ఇండియా, చైనా వంటి దేశాలనుంచి నిపుణులు అమెరికాకు వచ్చి ఉపాధి అవకాశాలను అందుకోవడంపై తీవ్రంగా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇవన్నీ మన ఐటి రంగానికి, నిపుణులకు ప్రతికూలమైన పరిణామాలే. ఐటి రంగంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలకు తోడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, ప్రభుత్వ ప్రోత్సాహకాలు మందగించడం, బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడం వంటి కారణాల రీత్యా ఐటి రంగంలో ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండేళ్ల క్రితంనాటి నియామకాలతో పోల్చి చూస్తే, 60 శాతం నియామకాలు తగ్గినట్లు ఒక అంచనా. ఈ నేపథ్యంలో యువత తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటూ, తాజాగా వెలుగు చూస్తున్న సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గం. మార్పు ఒక్కటే సహజమైనది. మారుతున్న కాలంతోపాటు మారకపోతే వెనుకబడిపోవడం తథ్యమనే విషయాన్ని యువత గ్రహించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News