Wednesday, January 8, 2025

పక్షుల రక్షణతో ప్రకృతి సంరక్షణ

- Advertisement -
- Advertisement -

పక్షులు మానవునికి జీవన గమనం నేర్పుతాయి. వాటిని కాపాడటం మన కర్తవ్యం’ అని భారత దేశ పక్షి శాస్త్ర పితామహుడు సలీం అలీ అన్నమాటలు జనవరి 5, జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పక్షులు ప్రకృతికి అందాన్ని, పక్షుల గానం మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. పక్షుల జీవన విధానం మానవునికి సహనాన్ని, శ్రమను, స్వేచ్ఛను నేర్పుతాయి. వీటి కదలికలు, జీవన శైలులు పర్యావరణ పరిస్థితులపై మానవునికి స్పష్టమైన సంకేతాలను ఇస్తాయి. పక్షులు వ్యవసాయంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. పంటలకు హానిచేసే పురుగులను తిని పంటలను రక్షిస్తాయి. పక్షులు పుష్పించే పూలనుండి మకరందాన్ని పీల్చేక్రమంలో పరాగసంపర్కానికి సహకరిస్తాయి. ఈ ప్రక్రియ పంటల ఉత్పాదకతను పెంచుతుంది. అందుకని పక్షులను వ్యవసాయానికి సహజ మిత్రులు అని అంటాము. చనిపోయిన చిన్న జీవుల అవశేషాలను తినడం ద్వారా పక్షులు (గద్దలు, రాబందులు) వ్యాపించే రోగాలను తగ్గిస్తాయి. ఇవి పర్యావరణానికి అందాన్ని జోడించి పర్యాటకులను ఆకర్షించి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతాయి. ఇంతగా మనిషికి, ప్రకృతి, వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉన్న పక్షులు నేడు అడవులు అంతరించిపోవుట వలన, కమ్యూనికేషన్ రంగాలలో సాంకేతికత విప్లవాత్మకంగా అభివృద్ధి చెందడం వలన అంతరించిపోవుటకు సమీప దూరంలోఉన్నాయి. నేడు ప్రపంచ వ్యాప్తంగా అడవుల విస్తీర్ణం ఊహకు కూడా అందని వేగంతో రోజురోజుకి తగ్గిపోతుంది. దీనికి గల ప్రధాన కారణం జనాభా విస్పోటనం, గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత. వీటి కారణంగా అడవులను నరికి నివాస స్థలాలను ఏర్పరుచుకుంటున్నారు. ఆహార కొరతను అధిగమించుటకు అడవులను నరికి సాగుభూమిని వృద్ధి చేసుకుంటున్నారు. నిరక్షరాస్యత కారణంగా దీని ఫలితాలను అంచనా వేయలేకపోతున్నారు. పక్షులు వాటి నివాస స్థలాలైన వృక్షాలపై అవాసాలను కోల్పోయి అంతరించిపోవుటకు దగ్గర వుతున్నాయి. ఉదాహరణకు బట్టమేక పక్షి, మన జాతీయ పక్షి నెమలి.
కమ్యూనికేషన్ రంగాలలో సాంకేతిక విప్లవం ఎంతో సంతోషకరమైన విషయం అయినప్పటికీ పక్షుల మనుగడకు నష్టం వాటిల్లుతుందనే సమాచార వ్యాప్తి పక్షి, ప్రకృతి ప్రేమికులను కలవరపెడుతోంది. చరవాణి(మొబైల్)ల సమాచార ప్రసారం కోసం రేడియోత రంగాలను విడుదల చేస్తాయి. ఈ రేడియో తరంగాలు చరవాణి (మొబైల్) ప్రసార స్తంభాల (సెల్టవర్స్) ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఈ రేడియో తరంగాలు చిన్నజీవులైన పక్షులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. చారవాణి ప్రసార స్థంభాల ద్వారా వ్యాప్తి చెందే వికిరణాల కారణంగా పక్షులు వాటి దారులను గుర్తించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటి కారణంగా పక్షులు ఆవాస స్థలాలు మారిపోతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు, ఆహార లభ్యతలో తగ్గుదల వలన పక్షులు తమ సంతతిని పెంచటంలో ఇబ్బందులు పడుతున్నాయి. చరవాణి స్థంభాలు విడుదల చేసే రేడియా తరంగాల ప్రభావం వలన పక్షుల జ్ఞానేంద్రియాలు (సెన్స్‌ఆర్గాన్స్) దెబ్బతిని ఆహారాన్ని గుర్తించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని శాస్త్రీయ పరిశోధనలు చరవాణి ప్రసార స్థంభాల చుట్టూప్రక్కల ఉన్న పక్షుల జనాభా తగ్గుముఖం పట్టిందని ఉద్ఘాటిస్తున్నాయి.
పక్షుల రక్షణ కోసం చట్టాలు
భారత దేశంలో పక్షులను రక్షించడానికి, వాటి నివాస స్థలాలను కాపాడటానికి వివిధ చట్టాలు అమలులో ఉన్నాయి.
1. వన్యప్రాణి పరిరక్షణ చట్టం -1972 ప్రకారం ఏ వ్యక్తి అయినా పక్షులను హరించడం, గూడులను ధ్వంసం చేయడం, పక్షులు పెట్టిన గుడ్లను తీయడం నేరంగా పరిగణించబడుతుంది.
2. పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986 ప్రకారం పక్షులను ఆహారం, నివాసం అందించే చెట్లను నరకడం లేదా వాటి నివాస స్థలాలను ధ్వంసం చేయడం నేరంగా భావించబడుతుంది.
అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు
1. CITES (Convention on International Trade in Endangered species) ఒప్పందం, అరుదైన పక్షుల అక్రమ వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది.
2. Ramsar Convention తేమభూములను కాపాడటం ద్వారా వలస పక్షుల అవాసాన్నికల్పిస్తుంది.
పక్షుల సంరక్షణ మార్గాలు
పక్షుల సంరక్షణ అనేది పర్యావరణ సంరక్షణకు కీలకం. పక్షులను రక్షించడం ప్రతి మనిషి బాధ్యత. పక్షులు కనుమరుగు అవుతున్న పరిస్థితులలో వాటి జీవన ప్రదేశాలను కాపాడటం, ఆహార భద్రత కల్పించడం, పచ్చదనం పెంచడం, కృత్రిమ రసాయనాల వాడకాన్ని తగ్గించడం, పక్షుల సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచడం, విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పక్షుల రక్షణ చట్టాలను గౌరవించడం, పర్యవేక్షించడం, చరవాణి ప్రసార స్తంభాల స్థానం, రేడియో తరంగాల పరిమితిని నియంత్రించడం ద్వారా పక్షుల జనాభా సంఖ్యను వృద్ధి చేయవచ్చు. జాతీయపక్షులదినోత్సవం, పక్షుల ప్రాముఖ్యతను గుర్తుచేసుకునే ఒక మంచి సందర్భం. పక్షులను రక్షించడం కేవలం ప్రకృతికి మేలు చేయడం మాత్రమే కాదు, మన భవిష్యత్తుతరాలకు ప్రకృతి సంపదను అందించడం. ప్రతి వ్యక్తి పక్షుల రక్షణలో తమ పాత్ర గుర్తించి, వాటి జీవనాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలి. పక్షుల సంరక్షణయే భవిష్యత్తుకు భరోసా.‘ పక్షులను కాపాడటం అంటే ప్రకృతిని కాపాడటం. ప్రకృతి లేని జీవితం అసంభవం’ అని ఎల్డోలియో ఫోల్డ్ అన్న మాటలు మనం ఎప్పుడూ గమనంలో ఉంచుకుని పక్షుల సంరక్షణకు పాటు పడాలి.

కమలహాసన్ తుమ్మ
95056 18252

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News