సింగరేణి విస్తరించి ఉన్న కోల్ బెల్ట్ ప్రాంతంలోని సింగరేణి ఉద్యోగుల పిల్లలు, స్థానిక యువతకు దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించి వారిని మంచి స్థానాల్లో నిలిపేలా ప్రోత్సహించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు చెమట చుక్కలకు తర్ఫీదు పేరిట సింగరేణి యాజమాన్యం ఈ పథకానికి రూపకల్పన చేసినట్టు పేర్కొంది. సోమవారం సాయంత్రం సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, మహ్మద్ అలీ షబ్బీర్లు ఈ పథకం లోగోను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశాన్ని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వివరించారు. సింగరేణి కార్మికుల పిల్లలు కేవలం కార్మికులుగానో లేదా ఇతర చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ఉన్న అవకాశాలపై వర్కుషాప్లు, సెమినార్లు, కెరీర్ గైడెన్స్లను ప్రముఖ నిపుణులతో సింగరేణి ప్రాంతంలో ఏర్పాటు చేయిస్తున్నామని అన్నారు. దీనివల్ల జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను వారు అందిపుచ్చుకొని వివిధ రంగాల్లో ఉజ్వల కెరీర్లను మలచుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్ కో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.