మనతెలంగాణ/హైదరాబాద్: ఈ కార్ రేసులో నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వం క్విడ్ ప్రొకోకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన కొత్త కోణం అంటూ కొన్ని వివరాలను వెల్లడించింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన గ్రీన్‌కో దాని అనుబంధ కంపెనీ లు రేసు నిర్వహణకు ముందే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బిఆర్‌ఎస్‌కు రూ.49 కోట్ల మేర లబ్ధి చేకూర్చాయని ప్రభుత్వం పేర్కొంది. ఫార్ములా ఈ రేసు నిర్వహించిన గ్రీన్ కో కంపెనీ నుంచి బిఆర్‌ఎస్‌కు భారీగా లబ్ధి చేకూరినట్టు తెలిపింది. బిఆర్‌ఎస్ నుంచి గ్రీన్ కో బాండ్లు కొన్నట్లు స మాచారం ఉండడంతో ఈ డేటాను ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. బిఆర్‌ఎస్ నుంచి రూ.49 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను గ్రీన్ కో కంపెనీ, అనుబంధ సంస్థలు కొన్నట్లుగా ఆరోపించింది.
2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య లావాదేవీలు జరిగాయని కాం గ్రెస్ నాయకులు, ప్రభుత్వం తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుం చి లావాదేవీలు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించింది. ప్రతిసారి రూ.కోటి విలువ చేసే బాండ్లను గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసిందని పేర్కొంది. మోసాలు, దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ ఆరోపణలు చేస్తుందని, గ్రీన్ కో కంపెనీ నుంచి బిఆర్‌ఎస్ కు రూ.49 కోట్లు వచ్చాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు సైతం ఆరోపిస్తూ అప్పటి ఒప్పందాలను బయటపెట్టడం విశేషం.
క్విడ్‌ప్రోకోతో కోట్లు దోచుకున్న కెటిఆర్…
ఓఆర్‌ఆర్‌ను లీజుకు తీసుకున్న సంస్థ ఐఆర్‌బి ఇన్‌ఫ్రా కూడా బిఆర్‌ఎస్‌కు సంబంధించి సుమారుగా రూ.25 కోట్ల బాండ్లను కొనుగోలు చేసిందని ప్రభుత్వం విడుదల చేసిన వివరాల్లో పేర్కొంది. క్విడ్‌ప్రోకోతో కోట్లు దోచుకున్న కెటిఆర్ అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.