హైదరాబాద్: 25 మంది యూత్ కాంగ్రెస్ నేతలకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనలో సీఐపై దాడి చేసినట్టు యూత్ కాంగ్రెస్ నేతలపై నమోదైన కేసులో బుధవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలు విన్న న్యాయస్థానం కాంగ్రెస్ నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. కాగా, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా మంగళవారం నాంపల్లిలోని బిజెపి కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు.
అయితే, బిజెపి కార్యకర్తలు ఎదురుదాడి చేశారు. దీంతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు భారీ మోహరించి ఇరువర్గాలను చెదరగొట్టాయి. ఆ తర్వాత, బిజెపి నేతలు.. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గాంధీ భవన్ లోకి రాళ్లు విసిరారు. దీంతో హైటెన్షన్ నెలకొనడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. బిజెపి నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.