న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించడంతో ప్రధాన పార్టీలన్నీ హామీలతో దూసుకు వెళ్తున్నాయి. ప్రధానంగా మహిళలకు ఆర్థిక సహాయం, వృద్ధులకు ఉచిత ఆరోగ్యం స్కీమ్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ జీవన్ రక్షా యోజన స్కీమ్‌ను బుధవారం నాడు ప్రారంభించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే ఈ పథకం కింద రూ. 25 లక్షల ఆరోగ్యబీమా సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది. కాంగ్రెస్‌పార్టీ ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఇది. జనవరి 6న ప్యారీదీదీ యోజనను ఆ పార్టీ ప్రారంభించింది.
ఈ పథకం కింద ఢిల్లీ లోని మహిళలకు ప్రతినెలా రూ. 2500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. తాజాగా రెండో స్కీమ్‌ను ప్రకటించింది. జీవన్ రక్షా యోజన పథకాన్ని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ పథకం కింద రూ. 25 లక్షల వరకు ఆరోగ్యబీమా కల్పిస్తామని రాజస్థాన్ లోనూ ఇదే తరహా పథకాన్ని తాము ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం కింద ప్రజలందరికీ రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్స అందిస్తామని, దీనికి ఎలాంటి షరతులు, ఆంక్షలు ఉండవని చెప్పారు. రాజస్థాన్ లోని చిరంజీవి యోజన తరహాలో రూపొందించిన పథకం ఇది అని, రాజస్థాన్‌లో ఆరోగ్యహక్కు చట్టం తెచ్చామని తెలిపారు. ఢిల్లీలో ఇదో గేమ్ ఛేంజర్ స్కీమ్ అని పేర్కొన్నారు.