Thursday, January 9, 2025

తక్కువ తెలివి ఉంటే మహిళకు తల్లయ్యే హక్కు లేదా : బాంబే హైకోర్టు

- Advertisement -
- Advertisement -

తన కుమార్తెకు తెలివి తక్కువగా ఉన్నదని , కాబట్టి ఆమెకు గర్భస్రావం చేయించేందుకు అనుమతి ఇవ్వాలని ఓ తండ్రి వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలివి తక్కువగా ఉన్నంత మాత్రాన మహిళలకు తల్లయ్యే హక్కు లేదా ? అని ప్రశ్నించింది. తెలివి తక్కువగా ఉన్న మహిళలు పిల్లలను కనకూడదని చెప్పడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. 27 ఏళ్ల గర్భిణి తండ్రి తన కుమార్తె అబార్షన్ చేయించేందుకు అనుమతి ఇవ్వాలని బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన బిడ్డ తెలివితక్కువదని, పైగా పెళ్లి కాలేదని అందుకు కారణాలుగా చూపించాడు. ఈ పిటిషన్‌పై బాంబే హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. గర్భిణి మానసిక ఆరోగ్య పరిస్థితిపై ముంబై లోని జేజే ఆస్పత్రిలో పరీక్షలు చేయించాలని, జనవరి 8 నాటికి నివేదిక కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

నివేదికలో గర్భిణి మానసిక స్థితి సరిగ్గానే ఉన్నదని , కాకపోతే ఆమె ఇంటెలిజెన్స్ స్థాయి 75iQతో సగటు ఇంటెలిజెన్స్ కంటే తక్కువగా ఉందని తెలిపింది. ప్రస్తుతం మహిళ గర్భంలో పిండం వయసు 21 వారాలని , గర్భస్రావం చేయడానికి వీలుపడుతుందని పేర్కొంది. మెడికల్ బోర్డు నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఐక్యు తక్కువగా ఉందనే కారణంతో ఆమెకు తల్లయ్యే హక్కు లేదనడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. తను గర్భం దాల్చడానికి కారణం ఎవరో కూడా ఆమె చెబుతున్నందున ఆమె తల్లిదండ్రులు అతడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని సూచించింది. గర్భిణి, ఆమె గర్భానికి కారణమైన వ్యక్తి ఇద్దరూ మేజర్లే కావడం , పైగా తాను ఇష్టపూర్వకంగానే అతడితో రిలేషన్‌లో ఉన్నానని గర్భిణి చెబుతున్నందున దాన్ని నేరంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు గర్భిణిని వివాహం చేసుకోడానికి ఒప్పుకోకుంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. ఈ కేసు విచారణను జనవరి 13కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News