Thursday, January 9, 2025

త్వరలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో త్వరలో ప్రారంభిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో పిఎసిఎస్ ఛైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి సొంత నిధులు రూ.45 లక్షలతో నిర్మించిన నూతన భవనం ప్రారంభోత్సవం, రూ.24 కోట్లతో ముడిమ్యాల వయా రావులపల్లి, మేడిపల్లి, పొద్దటూర్ వరకు పిఆర్ రోడ్డును ఆర్‌అండ్‌బి రోడ్డుగా మారుస్తూ రెండు వరసల నిర్మాణానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ కాలె యాదయ్య, మాజీ ఎపి రంజిత్‌రెడ్డితో కలిసి ఆయన బుధవారం ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. త్వరలో అప్పా నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్ల రోడ్డు అన్ని హంగులు, నాణ్యతతో నిర్మాణం కానుందన్నారు.

అవసరమైతే పదే పదే క్షేత్రస్థాయిలో ఇక్కడి వస్తానని, వారం పదిరోజులకు ఒకమారు రోడ్డు నిర్మాణం పనులపై సమీక్ష చేస్తానని చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్‌కు సమీపంలో ఉందని, పంచాయతీ, ఆర్‌అండ్‌బి రోడ్ల నిర్మాణం, విస్తరణ జరగాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రోడ్ల నిర్మాణాలు చేపడతామన్నారు. ఎంఎల్‌ఎ, ఎంపి, విప్ తన దృష్టికి తీసుకువచ్చిన రోడ్లు అన్నింటినీ మంజూరు చేస్తానని తెలిపారు. జిల్లాలోని పిఆర్, అర్‌అండ్‌బి రోడ్లకు రూ.1000 కోట్లు కేటాయింపజేస్తానని తెలిపారు. చేవెళ్ల పిఎసిఎస్ ఛైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి తనకు అత్యంత ఆత్మీయుడని, నిస్వార్థం, సేవాభావం గల రాజకీయ నేత, పెద్ద మనస్సుతో స్వంత నిధులు రూ.45 లక్షలతో పిఎసిఎస్ నూతన భవనం నిర్మాణం చేయించడం అభినందనీయమన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ…. కాంగ్రెస్‌లోనే అభివృద్ధి జరిగిందని, బిఆర్‌ఎస్ హయంలో అంతా డొల్లతనమేనని, చేసింది గోరంతైతే చెప్పుకున్నది కొండంతా అని ఎద్దేవా చేశారు.

ఈనెల 26నుంచి రైతులకు పెంచిన రైతు భరోసా ప్రారంభం కానుందన్నారు. ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..చేవెళ్ల డివిజన్‌లోని అన్ని పిఆర్ రోడ్లను ఆర్‌అండ్‌బీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. షాబాద్ నుంచి కొమరబండ వయా మన్నెగూడ వరు రోడ్డు విస్తరణకు నిధులు కేటాయించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. మాజీ ఎంపి రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ….ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. జాతీయ రహదారి ఇక వేగవంతం కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టియుఎఫ్‌ఐడిసి ఛైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పొల్యూషన్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌సి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి, పిసిసి కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి బి.శ్రీనివాస్‌గౌడ్, అధికార ప్రతినిధి గౌరీ సతీష్ తదితరులు పాల్గొదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News