మన తెలంగాణ / హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న బనకచర్చ ప్రాజెక్ట పనులను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని గోదావరి యాజమాన్య బోర్డుకు బుధవారం లేఖ రాసింది. గోదావరి వరద జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఉండేందుకు వెంటనే గోదావరి బనకచర్చ అనుసంధాన(లింక్)ప్రాజెక్టు పనులను తక్షణమే నిలుపుదలచేసేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వం తన లేఖలో పేర్కొంది.
బనకచర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులు మంజూరుచేసే ముందు తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన నేపధ్యంలో గోదావరి యాజమాన్య బోర్డు తక్షణమే నిర్లయాన్ని వెల్లడించాలని కోరింది. గోదావరి బనకచర్చ అనుసంధాన(లింక్)ప్రాజెక్టుతో పాటు పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపు తీవ్రత ఎక్కువగా ఉందనే అంశాలపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ఏపీ ప్రభుత్వం దృష్టికి, గోదావరి యాజమాన్యం బోర్డు దృష్టికి తీసుకువచ్చిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది.