Friday, January 10, 2025

మునక మునుగోడుతో మొదలైందా?

- Advertisement -
- Advertisement -

బిజెపి మాతృక ‘భారతీయ జనసంఘ్’ కార్యవర్గ సమావేశం, నేటికి యాభైయేడు ఏళ్ల కిందటే (1967) ఒక చరిత్రాత్మక సందేశాన్నిచ్చింది. ‘పార్టీలో కొత్తవారి చేరిక, ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేయటం వంటివి జరిగినపుడు… పార్టీలో కొత్తగా చేరేవారు, పాత నాయకుల మధ్య ఓ సంఘర్షణ, సమస్యలు తలెత్తడం ఉంటుంది. దాన్ని సంయమనంతో అధిగమించాలి’ అని నిర్ణయించింది. అదే సందర్భంలో పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ మాట్లాడుతూ, ‘అస్పృశ్యత నేరం, రాజకీయ అస్పృశ్యత అతిపెద్ద నేరం’ అన్నారు. ‘అటువంటి కలయికలు తప్పదు, అప్పుడు అందరూ కలిసి పని చేయాల్సిందే’ అని వివరణా త్మకంగా ఆయన ఉద్బోధించారు. కొంచెం సర్దుబాట్లతోనయినా.. ఇదే విధానాన్ని పార్టీ నాయకత్వం ఇప్పటికీ దేశవ్యాప్తంగా అనుసరిస్తోంది. కానీ, ఆ విషయంలో వివాదమే తెలంగాణ బిజెపి విస్తరణలో తీవ్ర ప్రతిష్టంభనకు కారణమవుతోంది. ఈ సమస్యను అధిగమించలేక పార్టీ ఢిల్లీ నాయకత్వం అయోమయానికి గురవుతూ, తలపట్టుకుంటోంది. సమస్యలు సరే… పరిష్కారాలు కావాలి!

తెలంగాణలో బిజెపి పరిస్థితి బయటివారికే కాక అంతర్గతంగా పార్టీ శ్రేణులకూ విస్మయం కలిగిస్తోంది.ఎదిగే అవకాశం ఉండీ, విస్తరణలో వీడని ప్రతిష్టంభన ఏర్పడింది. ఓ పట్టాన తొలగటం లేదు. పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్ష నియామకమే జరగట్లేదు. సంస్థాగత ఎన్నికలకు దాన్ని ముడిపెట్టి ప్రస్తుతానికి సరిపెట్టారు. పాత కొత్త నాయకుల మధ్య ఘర్షణ వైఖరితో… రాష్ట్రంలో సంస్థాగత ఎదుగుదల ఒకడుగు ముందుకి రెండడుగులు వెనక్కి పడుతోంది. బిజెపి ఎదుగుదలను వేరెవరో కాదు, పార్టీ సొంత నాయకత్వమే అడ్డుకుంటున్నట్టుందని వారి హితైషులు, శ్రేయోభిలాషులే సనుక్కుంటున్నారు. పార్టీ ఢిల్లీ నాయకత్వపు ద్వైదీభావం కూడా పార్టీ శ్రేణుల్నే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకే విషయంలో రెండు విధాలుగా… అంటే, ఒకసారి ఒకలా, మరోసారి ఇంకోలా వ్యవహరించడం వెనుక లాజిక్కేమిటో ఎవరికీ అంతుబట్టడంలేదు. పాత కొత్త నాయకుల మధ్య సయోధ్య కుదుర్చకుండా, మరో పక్క… పార్టీ నేతలతో ఏ సంప్రదింపులు లేకుండా, మాటమాత్రంగానైనా చెప్పకుండా కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న తీరు వింతగా ఉంటోంది. లాంఛనంగా పార్టీలోకైనా రాకముందే బయటి వారికి పదవులు కట్టబెట్టడం చూస్తుంటే… ఢిల్లీ స్థానిక నాయకత్వం మధ్య సయోధ్య ఎంత గొప్పగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. తెలంగాణ బిసి నాయకుడు ఆర్.కృష్ణయ్య కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపి(రాజ్యసభ) స్థానం కట్టబెట్టడంలో అదే జరిగింది.
వామపక్షవాదిగా ముద్రపడ్డ ప్రొ. నాగేశ్వర్‌ను బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కలుస్తారు. కానీ ప్రయత్నం మీద కూడా పార్టీ సానుభూతిపరులైన పారిశ్రామికవేత్తలు, సామాజిక కార్యకర్తలు ఒకోసారి కలువలేని పరిస్థితులుంటాయి. ఆర్.కృష్ణయ్య రాజకీయ నేపథ్యం చిత్రంగా ఉంటుంది. 2014లో తెలుగుదేశం తెలంగాణ సిఎం అభ్యర్థిగా ప్రచారం పొంది, ఎల్‌బి నగర్ నుంచి ఎంఎల్‌ఎగా గెలిచారు. తర్వాత అయిదేళ్లు ఏనాడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని, పార్టీ కార్యాలయానికీ వచ్చేవారు కాదని టిడిపి వారే అంటారు. 2018 కాంగ్రెస్ అభ్యర్ధిగా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్న సంగతి అప్పట్లో చాలా మంది కాంగ్రెస్ వారికే తెలియదు. ఇక 2022లో వైఎస్‌ఆర్‌సిపి తరపున ఎపి నుంచి రాజ్యసభకు కృష్ణయ్య ఎంపిగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తర్వాత ఎంపి పదవికి ఆయన రాజీనామా చేశారు. అంతర్గతంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, ఉన్నట్టుండి బిజెపి తరపున, ఎపి నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయారు. టిడిపిజనసేనలతో బిజెపికి అక్కడ పొత్తుండటం వల్ల వారికో ఎంపి స్థానం లభించింది. కానీ, ఎంపి అయ్యాక ఆయనను పిలిచి పార్టీ సత్కరించడమో, ఆయనే స్వయంగా పార్టీ కార్యాలయానికి (ఎపిలోగాని, తెలంగాణలో గానీ) వచ్చి కృతజ్ఞతలు చెప్పడమో… వంటి మర్యాదలేవీ జరుగలేదని బిజెపివాదులే వాపోతుంటారు. పైగా, కర్కోటకుడు, కరడుగట్టిన నేరస్థుడు నయీమ్‌ను మెచ్చుకోవడమే కాక, తనకు రూ. 200 కోట్లు ఇస్తానన్నాడని, తనని పార్టీ పెట్టమన్నాడనీ కృష్ణయ్య చెప్పారు. అతని వల్ల ఓట్లు వచ్చాయా? వైఎస్‌ఆర్‌సిపియే ప్రకటించుకున్నట్టు ఆర్.కృష్ణయ్యకు ఎంపి సీటివ్వడం వల్ల బిసిలంతా ఆ పార్టీ వైపు మొగ్గి ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో వారికి అంతటి దయనీయ ఫలితాలు (11/175) ఎందుకు వస్తాయనే లాజిక్ ను బిజెపి కేంద్ర నాయకులు ఆలోచించారో, లేదో? తెలియదు. అమలుపరిచే వరకు కేంద్ర నాయకత్వ ఆలోచన ఎపి బిజెపి నాయకులకు తెలిసినట్టు లేదు. తెలంగాణలో పార్టీని గెలిపిస్తే బిసి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రజలకు చెప్పి, కారణాలే చెప్పాపెట్టకుండా, ఎన్నికల ముందు ఉన్నట్టుండి బిసి రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎందుకు తప్పించారో అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.
తెలంగాణ బిజెపిలో ఎన్ని సొబగులు ఉన్నా… నాయకుల మధ్య సయోధ్య లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు, చాన్నాళ్లుగా బిజెపిలో ఉన్న పాత తరానికీ మధ్య స్పర్ధ ఉంది. ఎన్నికైన ఎంఎల్‌ఎలు, ఎంపిల మధ్య, వారిలో వారికి కూడా పెద్దగా సఖ్యత లేదంటారు. జంట నగరాల ఏకైక ఎంఎల్‌ఎ రాజాసింగ్ ‘తానొక దుర్గం, తనదొక మార్గం’ అన్నట్టు విడిగానే వ్యవహరిస్తారు.ఎంపిలు ఈటల రాజేందర్, డి.అర్వింద్, డి.కె. అరుణ, మాజీ ఎంఎల్‌సి రాంచందర్రావులలో పార్టీ రాష్ట్ర అధ్యక్షపీఠం ఎవరికి దక్కుతుందనే చర్చ నిరంతరాయంగా సాగుతూనే ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో దాదాపు 35 వేల బూత్ కమిటీలకు గాను 22వేల కమిటీలు ఏర్పడ్డాయి, మిగతావి ఏర్పడుతున్నాయి. మండల కమిటీల ఏర్పాటు పూర్తయింది. జిల్లా కమిటీలు ఏర్పడాల్సి ఉంది. రాష్ట్ర కమిటీకి ఎన్నికలు నిర్వహిస్తారా? ఢిల్లీ నాయకత్వమే నియమిస్తుందా? తేలాల్సిన అంశం. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ను తిరిగి అధ్యక్షుడు కావాలని ఉందని, అందుకే ఆయన పరోక్షంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారని పార్టీలోనే ప్రత్యర్థులైన వారు ఢిల్లీ వరకు మోశారు.అది తెలిసి ఢిల్లీ నేతలు ఆగ్రహంగా ఉన్నారనే సమాచారంతోనే ‘రాష్ట్రాధ్యక్ష పదవికి నేను పోటీలో లేను’ అని బండి స్వయంగా మీడియా ద్వారా ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చిందనే ప్రచారముంది. పార్టీ నాయకుల మధ్య సఖ్యత లోపించడం వల్లే ఎన్నికల ముందు అత్యవసరంగా నాయకత్వాన్ని మార్చాల్సి వచ్చిందని స్వయంగా ప్రధాని ఒక ఆంతరంగిక సమాచారంలో వెల్లడించే వరకు, ఆ మార్పు ఎందుకు జరిగిందనేది మిస్టరీయే! అప్పట్లో ఆయన జరిపిన పాదయాత్ర (నాలుగు విడతల)ను అధికారికంగా ముగించలేదు. ఎందుకు అనుమతించారో? ఎందుకు ఆపేయమన్నారో..? హేతుబద్ధంగా ఎందుకు ముగించలేదో కూడా ఎవరికీ తెలియదు. వివాదాస్పదమైన ‘పుష్ప’ వ్యవహారంలో… హీరో అర్జున్‌ను నెత్తిన పెట్టుకొని, అవసరానికి మించి రాష్ట్రనాయకత్వం స్పందించిన తీరుకు అధిష్టానం అనుమతి ఉందా? అన్నది పార్టీ శ్రేణుల్లోనే సందేహం!
ఒక్క తప్పుతో పతనం
పాలక బిఆర్‌ఎస్ నుంచి ఈటల రాజేందర్ బిజెపిలోకి వచ్చి, హుజూరాబాద్ ఉప ఎన్నిక గెలిచే వరకు శ్రేణుల్లోనే కాక పార్టీలోనూ మంచి ఊపు ఉండింది. సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్ గజ్వేల్ రెండు చోట్ల నుంచి ఆయన ఓడిపోయినా…. మల్కాజిగిరి నుంచి లోక్‌సభకు గెలవటంతో మళ్లీ ఊపొచ్చింది. కానీ, తానాశించిన రాష్ట్రాధ్యక్ష పదవికి పార్టీలోని పాతతరం నుంచి ప్రతిఘటన ఎదురవడంతో మళ్లీ డీలాపడ్డారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెరుగైన స్థితి, హుజూ రాబాద్ ఉప ఎన్నిక, తర్వాతి వరంగల్ తదితర కార్పొరషన్ ఎన్నికలు…. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా బిజెపి గెలుపు బాటలో సాగుతున్న తరుణంలో మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక ముంచుకు వచ్చింది. ‘వచ్చింది’ అనే కంటే ‘తెచ్చుకున్నారు’ అనడమే సబబేమో! సరైన అధ్యయనం, తగిన అంచనా లేకుండా చేజేతులా కొని తెచ్చుకున్న ‘తొందరపాటు చర్య’లా, బిజెపిని నిలువునా ముంచిన ఉపఎన్నిక అది! వరుసగా మూడు ఎన్నికల్లో పార్టీ ఓడుతున్న స్థానమది. 2014లో టిడిపితో పొత్తుల్లో పార్టీ నాయకుడు మనోహర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరకముందే ఆయనని అభ్యర్థిగా ప్రకటించి, నియోజక వర్గంలో, ఎన్నికల సభలో కండువా కప్పారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కని ఆ ఎన్నికలో.. పాలకపక్షం చేతిలో ఓటమి బిజెపికి పెద్ద షాక్! అప్పటివరకున్న ఊపు తుస్సుమంది. బిజెపిలో చేరాలా కాంగ్రెస్‌లోనా… అని అప్పటిదాకా ఊగిసలాటలో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి ఎందరో నాయకులు, ఈ ఫలితంతో బిజెపి పై ఆశలు వదులుకొని కాంగ్రెస్‌లో చేరిపోయారు. చివరకు మునుగోడు బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లోకే వెనక్కి వెళ్లిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా తటస్థ ఓటర్లు కూడా అటే మొగ్గడంతో మునుగోడు చేదు అనుభవపు ప్రతికూల ప్రభావం, 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లోనూ బిజెపి అవకాశాలను తుడిపేసింది. ఒక రకంగా రాష్ట్రంలో బిజెపి పతనానికి మునుగోడు ఓటమి నాందీ వాచకమైంది.
అయోమయంలో అధిష్టానం
అధికారంలోకి వస్తామనుకున్న తెలంగాణలో పరిణామాలు, ముఖ్యంగా సంస్థాగత అంశాలు బిజెపి అధిష్టానానికి మింగుడుపడటం లేదు. పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిలతో ఇటీవల భేటీ అయిన ప్రధాని మందలించింది ఇందుకే! విషయాలన్నీ తెలుస్తున్నా… ఏమీ చేయలేని అచేతన స్థితి! పార్టీ నాయకుల మధ్య నెలకొన్న అనారోగ్యకర స్పర్థకు ఆర్‌ఎస్‌ఎస్ స్థానిక నాయకత్వమూ విసిగిపోయినట్టు సమాచారం. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకపోవడం, దీన్‌దయాల్ ఉపాధ్యాయ చెప్పినట్టు ‘పాత -కొత్త నాయకులు కలిసి నడవాల్సిందే’ అనే వాస్తవికతను జీర్ణించుకోకపోవడమే కారణమన్న భావన ఉంది. కేంద్రంలో అధికారం ఉండి, ఆర్థిక వనరులకూ కొదువలేక, ఎనిమిదేసి మంది ఎంపిలు-, ఎంఎల్‌ఎల బలముండి… ప్రజాక్షేత్రంలో ముందడుగు పడటం లేదు. అందు కే, పార్టీ కేంద్ర నాయకత్వం అయోమయంలోపడి తలపట్టుకుంటోంది. ఏం చేస్తున్నామో తెలియని స్థితికి వారి నిర్ణయాలే నిదర్శనం!.

దిలీప్‌రెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News