ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుక్మా జిల్లాలో గురువారం భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు చనిపోయారని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ తెలిపారు. సుక్మాలో నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా బలగాలు విజయం సాధించినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు నక్సలైట్ల భౌతిక కాయాలను రికవర్ చేసుకున్నారు. కాగా నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.
హోం పోర్ట్‌ఫోలియోను కూడా కలిగి ఉన్న విజయ్ శర్మ ఈ వివరాలను విలేకరులకు తెలిపారు. బీజాపూర్ జిల్లాలో జనవరి 6న మందుపాతర పేలి ఎనిమిది మంది భద్రతా సిబ్బంది చనిపోయిన విషయంపై అడుగగా ‘ఆ కారణంగా భద్రతా బలగాలకు నక్సలైట్లపై తీవ్ర ఆగ్రహం ఉంది’ అని ఆయన జవాబిచ్చారు. నిర్ణీత కాలంలో నక్సలైట్ల సమస్య లేకుండా పూర్తిగా తుడిచేస్తామని కూడా ఆయన తెలిపారు.ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే 2026 మార్చి నాటికి నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని సోమవారం అన్నారు.